ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ టైం నడుస్తోంది. అఖండతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన బాలయ్య.. అన్స్టాపబుల్తో ఆహా అనిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చింది వీరసింహారెడ్డి సినిమా. సంక్రాంతికి ఇంకో రెండు రోజులుండగానే.. బాలయ్య ఫ్యాన్స్‌కు పండగ మొదలైంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో.. హెవీ సెంటిమెంట్‌తో జనవరి 12న విడుదలయింది ‘వీరసింహారెడ్డి’. ఇంతకు ముందులాగే సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి లాగే.. ఈసారి కూడా ఒంటిచేత్తో ఊచకోత కోయడానికి వచ్చేశారు బాలయ్య. మరి భారీ అంచనాల మధ్య వచ్చిన వీరసింహారెడ్డి.. ఎలా ఉంది.. బాలయ్య ఖాతాలో మరో హిట్ పడినట్టేనా.. అసలు వీరసింహారెడ్డి కథేంటి!?
రాయలసీమలో విలన్ దునియా విజయ్ (ప్రతాప్ రెడ్డి) ఎంట్రీతో మొదలైన కథ.. ఇస్తాంబుల్‌కి వెళ్తుంది. అక్కడ జయసింహారెడ్డి, ఇషా (శృతిహాసన్) మధ్య లవ్ ట్రాక్ కాస్త ఎంటర్టైన్ చేస్తుంది. వీళ్లు పెళ్లి చేసుకోవాలనుకున్న తర్వాత.. తనకు తండ్రి లేడని జయసింహారెడ్డి చెప్పడంతో.. తల్లి హనీరోజ్ తండ్రి ఉన్నాడని చెబుతుంది. ఇక్కడ నుంచి కథ రాయలసీమకు వస్తుంది. సీమలో ఎవ్వరు కత్తి పట్టకూడదని.. తాను కత్తి పట్టి సీమను సింహంలా కాపాడుతుంటాడు వీరసింహారెడ్డి. మరోవైపు తనను చంపడానికి భానుమతి (వరలక్ష్మీ), ప్రతాప రెడ్డి (దునియా విజయ్) పగతో రగిలిపోతుంటారు. ఆ సమయం ఎప్పుడొస్తుందా.. అని ఎదురు చూస్తుంటారు. ఇలాంటి సమయంలో.. 30 ఏళ్లుగా దూరంగా ఉన్న తన కొడుకు కోసం వీరసింహారెడ్డి ఇస్తాంబుల్ వెళ్లాల్సి వస్తుంది. అక్కడ జయసింహా రెడ్డిని కలుసుకున్నా తర్వాత.. పెళ్లి సంబంధం మాట్లాడే సమయంలో.. హనీ రోజ్ రిలేషన్ గురించి తెలుస్తుంది. అదే కరెక్ట్ టైం అని భావించిన భానుమతి.. వీరసింహారెడ్డిని చంపడానికి ఇస్తాంబుల్‌కి వెళ్తుంది. అక్కడే వీరసింహారెడ్డి, భానుమతి అన్నా, చెల్లెలని తెలుస్తుంది. మరి సొంత అన్నను భానుమతి తన చేతులతో ఎందుకు చంపింది.. అన్నా చెల్లెల మధ్య అంత పగ ఎందుకొచ్చింది.. తండ్రి చనిపోయిన తర్వాత.. ఆయన ఆశయం కోసం జయసింహారెడ్డి ఏం చేశాడు.. అసలు ప్రతాపరెడ్డికి, వీరసింహారెడ్డికి సంబంధం ఏంటి.. అనేదే అసలు కథ.
ఒక్క మాటలో చెప్పాలంటే.. వీరసింహారెడ్డి ఓవర్ యాక్షన్ డోస్.. హెవీ సిస్టర్ సెంటిమెంట్‌తో కూడుకున్న కథ అని చెప్పొచ్చు. బాలకృష్ణకు ఫ్యాక్షన్ కథ కొత్తేం కాదు. ఇందులో ఆయన ద్విపాత్రాభినయంతో భళా అనిపించారు. వీరసింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా దుమ్ముదులిపేశాడు. అయితే కొడుకుగా కంటే.. తండ్రిగా వీరసింహారెడ్డి వీరంగం తెరపై చూడాల్సిందే. ముఖ్యంగా బాలయ్య యాక్షన్ సీన్స్, డైలాగులు మాస్ ఆడియన్స్ పూనకాలు తెప్పిస్తాయి. యాక్షన్ కాస్త ఓవర్‌గా అనిపించినా.. ఫ్యాన్స్‌ను మెప్పిస్తుంది. అయితే అంతకుమించిన సెంటిమెంట్‌తో కంటతడి పెట్టించాడనే చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చెల్లెలి పాత్రలో నటించిన వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి. ఆమె భానుమతిగా అదరగొట్టేసింది. అలాగే మలయాళ నటి హనీ రోజ్‌కు కూడా ఇంపార్టెంట్ రోల్ పడింది. ఇక విలన్‌గా నటించిన కన్నడ హీరో దునియా విజయ్ బాలయ్యకు ధీటుగా నిలిచే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ శృతి హాసన్ గ్లామర్, డ్యాన్స్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. కాకపోతే రెండు పాటలు, మూడు సన్నివేశాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఇక తమన్ అయితే.. అఖండ తరహాలోనే.. సినిమా స్టార్టింగ్ నుంచి.. చెవులు చిల్లులు పడేలా వాయిస్తునే ఉన్నాడు. తేలిపోయే సీన్స్‌ను కూడా తనదైన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ఎలివేట్ చేశాడు. యాక్షన్ సీన్స్‌లో థియేటర్లలో పూనకాలు తెప్పించాడు. సాయిమాధవ్ బుర్రా డైలాగులు కూడా చాలా పవర్ ఫుల్‌గా ఉన్నాయి. దానికి తోడు గోపీచంద్ మలినేని టేకింగ్.. బాలయ్య బాబు ఎలివేషన్ ఊహించినట్టే ఉంది. కానీ కొన్ని ఎమోషనల్ సీన్స్‌ను ఇంకాస్త ఎలివేట్ చేస్తే బాగుండని అనిపిస్తుంది.
ఫైనల్‌గా.. సవతి అన్నా, చెల్లెల బంధం కూడా బలమైందని చూపించడమే.. వీరసింహారెడ్డి కథ. బాలయ్య నటన, తమన్ కొట్టుడుకు.. ఫ్యాన్స్ ఎంజాయ్ చేయొచ్చు. అయితే సినిమా కాస్త ల్యాగ్ అనిపిస్తుంది.. ఓ పావుగంట ట్రిమ్ చేస్తే బాగుండేది.
ప్లస్ పాయింట్స్: బాలకృష్ణకు కలిసొచ్చే ఫ్యాక్షన్ కథ తమన్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్: స్లో నేరేషన్ తెలిసిన కథే కావడం అక్కడక్కడ పాత సినిమాలు గుర్తుకు రావడం