రానున్న అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో లేదా ఎన్నిల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే అవకాశాలు ఉన్నాయా? మొదట జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికీ మెజార్టీ రాకుంటే హంగ్ ఏర్పాటయ్యే పక్షంలో హస్తం-కారు దోస్తీ తప్పదా? జాతీయ రాజకీయాల్లోను ఎన్డీయే వ్యతిరేక కూటమి యూపీఏకు వివిధ ప్రాంతీయ పార్టీల మద్దతు నేపథ్యంలో కేసీఆర్ కూడా అదే మార్గంలో నడవక తప్పదా? అంటే అవుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యాఖ్యలు కూడా అందుకు అనుగుణంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 2024 లోకసభ ఎన్నికల్లో నితీష్ కుమార్ వంటి నాయకులు ప్రధానమంత్రి రేసులోకి వచ్చారు. అయితే బీజేపీని ధీటుగా ఎదుర్కోవడానికి రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా నితీష్ కుమార్ సహా పలువురు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
వచ్చే లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ఉంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని నితీష్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా కాంగ్రెస్ ముఖ్యనేతకు జై కొట్టారు. ఇలా వివిధ ప్రాంతీయ పార్టీలు రాహుల్ గాంధీకి మద్దతిస్తున్న పరిస్థితుల్లో కేసీఆర్ కూడా అదే దారిలో నడిచే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత వి హనుమంత రావు.
2024 లోకసభ ఎన్నికల నాటికి కే చంద్రశేఖర రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏతో పొత్తు కుదుర్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా ప్రభావం చూపిందని, కాంగ్రెస్లో కొత్త ఉత్తేజాన్ని తీసుకు వచ్చిందన్నారు. అయితే వి హనుమంత రావు చేసిన వ్యాఖ్యలు అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అదే సమయంలో తాము మొదటి నుండి చెబుతున్నట్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎప్పటికైనా ఒకటేనని బీజేపీ నాయకులు చెబుతున్నారు.