బ్యాంకులు గత ఐదు ఆర్థిక సంవత్సరాలలో రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలను (NPA) రైటాఫ్ చేసినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో తెలిపారు. ఇందులో గత నాలుగు ఆర్థిక సంవత్సరాలలోనే రూ.8.5 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేసినట్లు తెలిపారు. అలాగే, ఇదే కాలంలో పబ్లిక్ రంగ బ్యాంకులకు చెందిన ఒక లక్ష మూడువేల కోట్ల రైటాఫ్ లోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. నాలుగేళ్లు దాటిన మొండి బకాయిలను బ్యాంకులు రైటాఫ్ పేరిట బ్యాలెన్స్ షీట్ల నుండి తొలగిస్తాయని, అయితే రైటాఫ్ సాంకేతికత కోసమేనని, కానీ రుణాలు మాఫీ చేసినట్లు కాదన్నారు. గత అయిదేళ్ల కాలంలో అక్షరాలా రూ.10,09,511 కోట్లు రైటాఫ్ చేసినట్లు తెలిపారు.
బ్యాంకులు ఎప్పటికప్పుడు రైటాఫ్ రుణాలకు సంబంధించి దృష్టి సారించి, వసూలు చేసే ప్రయత్నాలు చేస్తారని తెలిపారు. ఇందులో భాగంగా సివిల్ కోర్టులలో సూట్ వేయడం లేదా డెట్ రికవరీ ట్రైబ్యునల్స్ను ఆశ్రయించి రికవరీ చేసే ప్రయత్నం చేస్తాయని తెలిపారు. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్, 2016 కింద కేసు ఫైల్ చేసి, వసూలు చేస్తారని తెలిపారు. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (SCB) గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం రూ.6,59,596 కోట్లు వసూలు చేశారని, ఇందులో రూ.1,32,036 రైట్ ఆఫ్ రుణాలు ఉన్నట్లు తెలిపారు.
బ్యాంకుల మొండి బకాయిల విషయంలో ఆయా బ్యాంకు అధికారులే కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు నిర్మల తెలిపారు. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఎన్పీఏలకు సంబంధించి మూడువేల మందికి పైగా అధికారులను బాధ్యులను చేస్తూ చర్యలు చేపట్టామన్నారు. ఇందులో ఏజీఎం, ఆ పైస్థాయి అధికారులు ఉన్నట్లు తెలిపారు.