»When Is Akshaya Tritiya Celebrated In India Do You Know The Special This Day 2023
Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ ఎప్పుడు జరుపుకుంటారు..ప్రత్యేకత తెలుసా మీకు?
సంస్కృతంలో 'అక్షయ' అంటే నాశనం లేనిది. 'తృతీయ' అంటే చంద్రుని మూడవ దశ. అక్షయ తృతీయ (అఖ తీజ్ లేదా అక్తి) హిందువులు, జైనులకు ముఖ్యమైన పండుగ. ముహూర్తం కూడా చూడనవసరం లేని నాలుగు తిథిలలో ఇది కూడా ఒకటి. ఇది వైశాఖ మాసంలో శుక్ల పక్షంలోని తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. ఈ క్రమంలో ఈరోజు ప్రత్యేకత గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా హిందువులు జరుపుకునే అత్యంత పవిత్రమైన రోజులలో అక్షయ తృతీయ(Akshaya Tritiya)కూడా ఒకటి. ఈ రోజున ఏదైనా పని ప్రారంభిస్తే అది విజయం సాధిస్తుందని నమ్ముతారు. ప్రధానంగా ఈ రోజును అదృష్టం, విజయం, లాభాలకు ప్రతీకగా భావిస్తారు.
అక్షయ తృతీయ ఎప్పుడు జరుపుకుంటారు?
అక్షయ తృతీయ వైశాఖ మాసంలోని శుక్ల పక్షం మూడవ రోజున జరుపుకుంటారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఇది ఏప్రిల్-మే నెలలో వస్తుంది. ఈ రోజునే సూర్యుడు, చంద్రుడు తమ గ్రహస్థితిలో ఉత్తమంగా ఉంటారని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఈ రోజును ‘అఖా తీజ్’ అని కూడా పిలుస్తారు.
ముహూర్తం
ఈ ఏడాది అక్షయ తృతీయ తిథి ఏప్రిల్ 22, 2023న(April 22nd 2023) ఉదయం 7:49 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రోజు అంటే ఏప్రిల్ 23, 2023న ఉదయం 7:47కి ఇది ముగుస్తుంది. ఈ క్రమంలో అక్షయ తృతీయ పూజ ముహూర్తం ఏప్రిల్ 22న ఉదయం 6.04 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12:25 నిమిషాల వరకు ఉంది.
ఈ రోజు ప్రత్యేకతలు
పురాణాలు, పురాతన చరిత్ర ప్రకారం ఈ రోజుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. వాటిలో ముఖ్యంగా శ్రీకృష్ణుడితో పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వారికి ‘అక్షయపాత్ర’ను సమర్పించి గిన్నెతో వారిని ఆశీర్వదించాడని ప్రచారంలో ఉంది. ఆ క్రమంలో అది వారికి ఆహారాన్ని అపరిమితంగా అందించి ఆకలి లేకుండా చేసిందని అంటున్నారు. అంతేకాదు ఈ రోజును శ్రీమహావిష్ణువు యొక్క ఆరవ అవతారమైన పరశురాముని జయంతిగా కూడా జరుపుకుంటారు. మరోవైపు ఇదే రోజు అన్నపూర్ణా దేవి జన్మించింది. శ్రీకృష్ణుడు తన సహాయం కోసం వచ్చిన తన పేద స్నేహితుడు సుదామకు సంపద, ధన లాభాలను కూడా ఇదే రోజు ప్రసాదించాడు. ఈ రోజున గంగా నది స్వర్గం నుంచి భూమిపైకి దిగింది. ఇదే రోజున కుబేరుడు లక్ష్మీ దేవిని ఆరాధించాడు.
అక్షయ తృతీయ రోజు చేయాల్సినవి
విష్ణు భక్తులు ఈ రోజున ఉపవాసం ఉండి దేవతను పూజిస్తారు. అనంతరం పేదలకు అన్నం, ఉప్పు, నెయ్యి, కూరగాయలు, పండ్లు, వస్త్రాలు సమర్పించి ధాన ధర్మాలు చేస్తారు.
ఈ రోజున చాలా మంది బంగారు, బంగారు ఆభరణాలు కొంటారు. బంగారం అదృష్టం, సంపదకు ప్రతీక కాబట్టి ఈ రోజున దీనిని కొనుగోలు చేయడం పవిత్రమైనదిగా భావిస్తారు.
ప్రజలు ఈ రోజున వివాహాలు, దూర ప్రయాణాలను ప్లాన్ చేసుకుంటారు.
కొత్త వ్యాపారాలు, నిర్మాణ పనులు ఈ రోజున ప్రారంభిస్తారు.
ఇతర ఆచారాలలో గంగానదిలో పవిత్ర స్నానం చేయడం
ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహించడం, ధ్యానం చేయడం, పవిత్ర మంత్రాలను పఠించడం
శ్రీకృష్ణుని భక్తులు ఈ రోజున గంధపు చెక్కతో పూజిస్తారు. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి మరణానంతరం స్వర్గానికి చేరుకుంటాడని నమ్ముతారు.