ఒక మహిళ నర్మదా నది నీటిపై నడిచే వీడియో వైరల్ కావడంతో ఆమెను దేవత నర్మదా మాతగా (Goddess Narmada Mata ) కీర్తించారు స్థానికులు. ఆమె నీటి నుండి బయటకు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు ఆమె ఆశీర్వాదం కోసం ఆమె వద్దకు రావడం ప్రారంభమైంది. అలా వచ్చే వారి సంఖ్య పదులు, వందల నుండి వేలల్లోకి చేరుకుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి పోలీసులు రంగ ప్రవేశం చేయవలసి వచ్చింది. అయితే, ఆ మహిళ స్వయంగా తాను దేవుణ్ణి కాదని, నర్మదా నదిలో తీర్థయాత్ర చేస్తున్నానని చెప్పింది. అంతేకాదు, మహిళ బంధువులు కూడా ఆమె మానసిక స్థితి బాగా లేదని చెప్పారు. నదిలో నడక గురించిన అసలు విషయం కూడా చెప్పారు సదరు మహిళ. ఆమె గత 10 నెలల నుంచి ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. నదిలో నడక గురించి ఆమె స్వయంగా చెప్పిన మాటలు కూడా చూద్దాం. ఆమెను చూడగానే చాలామంది నర్మదా మాతాకీ జై అంటున్నారు.
ఈ మహిళ పేరు జ్యోతి రఘువంశీ. ఈమె నర్మదాపురంకు చెందిన మహిళ. ఆమె పది నెలల క్రితం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వచ్చేసింది. ఆమె దైవ దర్శనాలు చేసుకుంటోంది. అయితే ఈమె నదిలో నడుస్తుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఆమెను నర్మదా మాతగా కూడా పిలుచుకున్నారు. ఆమె దర్శనం కోసం, ఆశీర్వాదం కోసం చాలామంది ప్రయత్నాలు చేశారు. కానీ ఆమె తనకు తానుగా తనకు ఎలాంటి మహిమలు లేవని, నీళ్లలో నడవటం వంటివి విద్యలు తనకు తెలియదని చెప్పారు. తాను కేవలం నీళ్లు తక్కువగా ఉన్న చోట ఇంకా చెప్పాలంటే మోకాలి లోతు వరకు లేని చోట మాత్రమే నడుస్తున్నానని చెప్పారు. తన దుస్తులు కూడా బయటకు వచ్చాక ఇరవై నిమిషాల పాటు పూజ చేస్తానని, ఆ సమయంలో ఎండిపోతాయని చెప్పారు. కానీ మహిమలు, మంత్రాలు ఏమీ లేవని చెప్పారు. పోలీసులు రంగంలోకి దిగి ఆమె నుండి అనని విషయాలు తెలుసుకొని, అక్కడ వచ్చిన వారికి వివరాలు వెల్లడించారు.