ఎమ్మెల్యేలను కొనడం బీజేపీ(bjp)కి అలవాటే అంటూ ప్రకాష్ రాజ్(Prakash raj) సంచలన ఆరోపణలు చేశారు. ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడారు ప్రకాష్ రాజ్. ఈ సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అలజడి సృష్టించడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆరోపణలు చేశారు.
దేశంలో అన్ని చోట్లా బీజేపీ అదే పని చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు తెలంగాణలోనూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర చేసిందని విమర్శించారు. వారికి వేరే పని తెలియదంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకులను దొంగలతో పోల్చారు. ఇలాంటి రాజకీయాలు చేస్తున్న నేతలను ప్రజలు ప్రశ్నించాలన్నారు. దేశాన్ని నడిపిస్తుంది ప్రజలే.. కాబట్టి వారిలోనే మార్పు రావాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పనులపై ప్రకాష్ రాజ్ ప్రశంసలు కురిపించారు.
కాగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయాలనుకుంటోందన్న వార్తలు సంచలనంగా మారాయి. సైబరాబాద్ పోలీసులు తమకు అందిన సమాచారంతో మొయినాబాద్ అజీజ్ నగర్ లోని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్ లో బుధవారం రాత్రి సోదాలు చేశారు.
అక్కడ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్థన్ రెడ్డి, రోహిత్ రెడ్డిలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ కొందరు ప్రలోభపెట్టారని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో రామ చంద్రభారతి, సింహయాజి, నంద కుమార్ లను అరెస్ట్ చేశారు.