»Only Congress Understands Telangana Pulse Revanth Reddy
Revanth Reddy: రూ.500కే సిలిండర్, కాంగ్రెస్ ఆఫర్
కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారంలోకి వస్తే తెలంగాణలో రూ.500కే గ్యాస్ సిలిండర్ (gas cylinder) అందిస్తామని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారంలోకి వస్తే తెలంగాణలో రూ.500కే గ్యాస్ సిలిండర్ (gas cylinder) అందిస్తామని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) హామీ ఇచ్చారు. తన హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు హామీలు ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రతి నిరుపేదకు ఇంటి నిర్మాణంకోసం రూ.5 లక్షలు ఇస్తామని, రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. గోదావరి ముంపు బాధితుల కోసం ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాక్షేమాన్ని మరిచిందని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్, ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారన్నారు. కనీసం పార్టీ అధ్యక్షుడిగా దళితుడిని చేస్తారా అని సవాల్ చేశారు. తమ పార్టీ బాధ్యతలను దళిత కుటుంబానికి చెందిన మల్లికార్జున ఖర్గేకు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల కష్టాలు కాంగ్రెస్‌కు (Congress) తెలుసునని చెప్పారు. ప్రజల మనోభావాలను గుర్తించి తెలంగాణ ఇచ్చామన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇసుక దందా చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన పినపాక ఎమ్మెల్యే రంగా కాంతారావుకు ప్రజలు బుద్ధి చెప్పి ఇంటికి పంపించాలన్నారు.
నోట్ల రద్దు, జీఎస్టీ, ట్రిపుల్ తలాక్ వంటి విషయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్… బీజేపీకి (BJP) మద్దతు తెలిపారని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరాలని చూస్తున్నారని విమర్శించారు. రద్దైన రూ.1000 నోటు వంటి కేసీఆర్‌ను నమ్మడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరన్నారు. కాలనాగును అయినా కౌగిలించుకుంటాం… కానీ కేసీఆర్‌ను నమ్మలేమన్నారు. కల్వకుంట్ల కుటుంబంతో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలంటే మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందే అన్నారు. వివిధ రాష్ట్రాల్లో కంటే మన వద్ద చమురు ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మాత్రమే అర్థం చేసుకుంటుందన్నారు.
కాగా, రేవంత్ పాదయాత్రకు సీపీఐ నాయకులు సంఘీభావం తెలిపారు. ఆశ్వాపురం మండల కేంద్రంలో సీపీఐ నాయకులు కాసేపు కాంగ్రెస్ చీఫ్‌తో కలిసి అడుగు వేశారు. ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కూడా రేవంత్ వెంట నడిచారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేత వీ హనుమంత రావు కూడా యాత్రలో పాల్గొననున్నారు. రాష్ట్ర అధ్యక్షుడితో కలిసి రెండు రోజుల పాటు పాదయాత్ర చేయనున్నారు. మంగళవారం భద్రాచలం, బుధవారం పాలకుర్తిలో పాల్గొంటున్నారు. రేవంత్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతో కలిసి పాదయాత్రలో పాల్గొంటానని విహెచ్ తెలిపారు.
కాగా రేవంత్ పాదయాత్ర 14వ తేదీన భద్రాచలం నియోజకవర్గం, 15వ తేదీన పాలకుర్తి నియోజకవర్గంలో ఉంది. ఆ తర్వాత వరుసగా.. 16న వర్ధన్నపేట, 17న స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఉంది. 18 & 19 తేదీల్లో మహా శివరాత్రి విరామం ఉంటుంది. తిరిగి 20న వరంగల్ పశ్చిమ&తూర్పు, 21 & 22 తేదీల్లో భూపాలపల్లి, 23, 24, 25 & 26 వ తేదిన రాయ్‌పూర్ (ఛత్తీస్ గడ్)లో కాంగ్రెస్ ప్లీనరీ ఉంది. 27న పరకాలలో యాత్ర చేస్తారు.