చంద్రుడి దక్షిణ ధ్రువంపై సంచరిస్తున్న చంద్రయాన్-3 ప్రజ్ఞాన్ రోవర్ తన అన్వేషణలు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా చంద్రుడిపై భారీ బిలానికి సంబంధించిన ఫొటోలను తీసి పంపినట్లు అహ్మదాబాద్ రీసెర్చ్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ బిలం 160 కిలోమీటర్ల వెడల్పులో ఉన్నట్లు తెలిపారు. ఈ బిలం ఆచూకీతో చంద్రుడి భౌగోళిక చరిత్ర.. దక్షిణ ధ్రువానికి సంబంధించిన ఎన్నో కొత్త విషయాల పరిశోధనలకు అవకాశం ఏర్పడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.