FENNEL SEEDS Health Benefits : మనం ఏ రెస్టారెంట్లకో వెళ్లినప్పుడు అంతా తిన్నాక సోంపు గింజల్ని కూడా సర్వ్ చేస్తుంటారు. వాటిని చాలా మంది ఇష్టంగా తీసుకుని తింటూ ఉంటారు. అయితే ఇంట్లో మాత్రం వీటిని తినే అలవాటు చాలా మందికి ఉండదు. కానీ భోజనం అనంతరం దీన్ని తినడం వల్ల చాలానే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి మరి.
ఇటీవల కాలంలో చాలా మంది ఫాస్ట్ ఫుడ్లను, జంక్ ఫుడ్లను అధికంగా తింటున్నారు. ఫలితంగా రకరకాల జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారంతా భోజనం ముగించిన తర్వాత తప్పకుండా సోంపు(FENNEL SEEDS) తినే అలవాటు చేసుకోవాలి. ఈ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. సహజ నూనెలైన ఫెన్సోన్, అనెథోల్, ఎస్ట్రాకోల్ వంటివీ ఉంటాయి. ఇవన్నీ మన జీవ క్రియను వేగవంతం చేస్తాయి. అలాగే నోటి దుర్వాసనను తగ్గించే ఫ్రెషనర్లుగానూ ఉపయోగపడతాయి.
సోంపు గింజల్లో(FENNEL SEEDS) పొటాషియం, కాల్షియం లాంటి పోషకాలు ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. అలాగే కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు సైతం దృఢంగా ఉంటాయి. వీటిలో ఉండే ఏ విటమిన్ వల్ల కంటి చూపు సైతం మెరుగుపడుతుంది. చర్మ ఆరోగ్యమూ బాగుంటుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. వృద్ధాప్య ఛాయలు వేగంగా రాకుండా చేస్తాయి. అందుకనే భోజనం తర్వాత కాస్త సోంపు తినడం మంచింది. నీటిలో నానబెట్టి, మరిగించి వడగట్టి ఆ నీటిని సైతం తాగొచ్చు.