ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పీఠంపై వివాదం సద్దుమణగడం లేదు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవి కోసం ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య యుద్ధ వాతావరణం అలుముకుంది. మేయర్ పదవుల ఎన్నికకు తాజాగా సోమవారం మూడోసారి సమావేశం కాగా మళ్లీ గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ పరిణామాలతో తీవ్ర ఆగ్రహంంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టులో ఈ పంచాయితీని తేల్చుకోవడానికి సిద్ధమైంది.
ఢిల్లీ మున్సిపాలిటీలో మొత్తం 250 స్థానాలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 134 సీట్లలో విజయం సాధించి మేయర్ స్థానాన్ని సులభంగా దక్కించుకోవచ్చు. కానీ బీజేపీ నీచపు రాజకీయానికి తెరలేపింది. బలం లేకున్నా మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను పొందాలని కుట్రకు పాల్పడింది. దీంతో జనవరి 6, 24 తేదీల్లో జరిగిన మేయర్ ఎన్నిక సమావేశాన్ని గందరగోళంతో వాయిదా పడేలా చేసింది. తాజాగా సోమవారం సమావేశం కాగా లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న నిర్ణయం వివాదానికి తెరలేపింది.
10 మంది కౌన్సిలర్లను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నామినేట్ చేసి వారిని మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఓటింగ్ కు అనుమతించారు. అయితే ఢిల్లీ మున్సిపల్ చట్టం ప్రకారం ఇది విరుద్ధం. దీనిపై ఆప్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టింది. ప్రతిగా బీజేపీ నిరసన తెలిపింది. ఇద్దరి ఆందోళనలతో ఢిల్లీ మున్సిపాలి సమావేశం నిరవధికంగా వాయిదా పడింది. అయితే బీజేపీ ఉద్దేశపూర్వకంగా మేయర్ ఎన్నికలను అడ్డుకుంటుండడంపై ఆప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న నిర్ణయాలు, మున్సిపాలిటీ మేయర్ ఎన్నికను ఆలస్యం చేయడంపై సుప్రీంకోర్టులో తేల్చుకోవాలని ఆప్ నిర్ణయించింది. త్వరలోనే దీనిపై సుప్రీంలో పిటిషన్ వేయనుంది. మేయర్ ఎన్నికకు అవసరమైన బలం ఉన్నా తమను ఎన్నుకోకుండా బీజేపీ చేస్తున్న రాజకీయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లాలని ఆప్ నాయకులు భావిస్తున్నారు.