యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాల ట్యాంకర్‌ను డబుల్ డెక్కర్ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో 18 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
UP Road Accident News : ఇటీవల కాలంలో వరుస రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది ప్రజలు ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. బుధవారం ఉత్తర ప్రదేశ్‌లోనూ ఇదే రీతిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళుతున్న పాల ట్యాంకరును(Milk Tanker) డబుల్ డక్కర్ బస్సు( Double Decker Bus) వెనక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో 18 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను బంగార్ మావ్ సీహెచ్‌సీ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన ఈ ఉదయం 5:15 గంటల సమయంలో జరిగింది. ఉన్నావ్ ప్రాంతంలోని లఖ్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై(Agra-Lucknow Express Highway) ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనా స్థలంలో ఉన్న వారు వెంటనే పోలీసులకు, అధికారులకు సమాచారం ఇచ్చారు. బస్సు అతి వేగంగా వచ్చి పాల ట్యాంకర్ని ఢీ కొందని చెబుతున్నారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానిక అధికారులు సహాయక చర్యల్లో మునిగి పోయారు. మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. శవ పరీక్షల కోసం దగ్గర్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీని గురించి తెలుసుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం సోషల్ మీడియాలో స్పందించారు. ఒక రోడ్డు ప్రమాదంలో(Road Accident) ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.గాయ పడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ రూ.2లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయ పడిన వారికి రూ.50వేల చొప్పున ఇవ్వనున్నట్లు పీఎంఓ నుంచి ట్వీట్ చేశారు.