ఏపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చేపట్టిన కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గత నెలలో నిర్వహించిన పరీక్ష ఫలితాలను రికార్డు సమయంలో విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో సివిల్ కానిస్టేబుళ్లతో పాటు ఏపీఎస్పీ కానిస్టేబుల్ నియామకాల కోసం గత ఏడాది నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపు 6500పైగా ఉద్యోగాలను పోలీస్ శాఖలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4,59,182 మంది అభ్యర్థులు హాజరుకాగా, వారిలో 95,208 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు.
ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 7వ తేదీ వరకు ఆన్లైన్లో ఓఎంఆర్ షీట్లు అందుబాటులో ఉంటాయని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. రిజల్ట్స్ కోసం ఈ లింక్ ను https://slprb.ap.gov.in/UI/PCResults క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. మొత్తం 6,100 పోస్టుల భర్తీ కోసం గతనెల 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 35 ప్రాంతాల్లోని 997 పరీక్షా కేంద్రాల్లో దీన్ని నిర్వహించినట్లు రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు తెలిపారు.
రిక్రూట్మెంట్లో ఎంపికైన అభ్యర్ధులకు రెండవ దశ అప్లికేషన్లను ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 20వతేదీ సాయంత్రం ఐదు గంటలకు వరకు అనుమతించనున్నారు. దేహదారుఢ్యం, శారీరక సామర్థ్య పరీక్షలకు రెండవ దశ దరఖాస్తును తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా 94414 50639, 91002 03323 నంబర్లను సంప్రదించాలని బోర్డు ఛైర్మన్ సూచించారు.