Maharaja movie: విజయ్ సేతుపతి మహారాజ మూవీ ఎలా ఉందంటే
విజయ్ సేతుపతి 50వ సినిమా కావడం, ట్రైలర్ ఆకర్షణంగా కట్ చేయడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అంతే కాదు ఈ సినిమాకు విజయ్ సేతుపతి నేరుగా తెలుగులో ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో తెలుగు ప్రేక్షకులు సినిమాపై ఆసక్తిని పెంచుకున్నారు. మరి అందరి అంచనాలను ఏ మేరకు ఈ సినిమా అందుకుందో ఇప్పుడు చూద్దాం.
మహారాజ(విజయ్ సేతుపతి) ఓ బార్బర్. ఓ ప్రమాదంలో భార్య మరణించడంతో తన కూతురు జ్యోతితో కలిసి ఓ ఇంట్లో నివసిస్తుంటాడు. అనుకోకుండా ఒక రోజు గాయాలతో, ఒంటినిండ రక్తంతో పోలీసుస్టేషన్‌కు వెళ్తాడు. తన ఇంటిపై దొంగలు దాడి చేసిన తన లక్ష్మిని ఎత్తుకెళ్లారని పోలీసులకు చెప్తాడు. అక్ష్మీ ఎవరో తెలియకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయరు. కానీ ఇన్విస్టిగేషన్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో పోలీసులకు నమ్మలేని నిజాలు రివీల్ అవుతుంటాయి. ఇంతకీ లక్ష్మి ఎవరు? లక్ష్మి ఎవరో పోలీసులు కనిపెడతారా..? మహారాజ లక్ష్యం ఏంటి? అసలు మహారాజ కథ ఏంటి, ఆ దొంగలకు మహారాజకు ఉన్న సంబంధం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇదోక భిన్నమైన యాక్షన్ థ్రిల్లర్. సాధారణ సినిమాలా కనిపించే ఎన్నో లేయర్లు ఉన్న స్టోరీ మహారాజ. ఇది బేసిక్‌గా రొటిన్ కథే అయినా దర్శకుడు చూపించిన స్క్రీన్‌ప్లేతో అద్భుతంగా తీర్చిదిద్దాడు. ప్రతీ సన్నివేశాన్ని ఉత్కంఠబరితంగా చూపించాడు. విజయ్ సేతుపతి తన పాత్రలో జీవించాడు. సింపుల్ కథతో మొదలై అలా వెళుతున్న కొద్ది ఊహలకందని ట్విస్టులతో భావేద్వేగంగా సాగుతుంది. మొదటి భాగంలో పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం పట్టింది. విజయ్ సేతుపతి క్యారెక్టర్‌ను చాలా సాధారణంగా పరిచయం చేశారు. కానీ కథ వెళ్తున్నప్పుడు ఆయన పాత్రలోని లోతు తెలుస్తుంది. ఓ వైపు లక్ష్మీ కోసం వెతకడం, మరో వైపు తన కూతురు జ్యోతీ సీన్లు, విలన్ల కథ స్క్రీన్ ప్లే పరంగా అద్భుతంగా రాసుకొచ్చారు. ఇక ఇంటర్వెల్లో బలమైన ట్విస్ట్ ఇవ్వడంతో సెకండ్ హాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది.
ఇక సెకండ్ ఆఫ్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఎన్ని అవమానాలు ఎదురైనా లక్ష్మీ కోసం ఎందుకు వెతుకుతున్నాడు. వరుస హత్యలు చేసే ఆ దొంగల ముఠాకు మహారాజకు ఉన్న సంబంధం ఏంటన్నది చాలా ఆసక్తిగా ఉంటుంది. తన కూతురు జ్యోతి విషయంలో మహారాజకు జరిగిన అన్యాయం అందరిని కదిలిస్తుంది. మహారాజ అర్థం అయ్యగా తన పగలో న్యాయం ఉందని పోలీసులు భావించి అతనికి సాయం చేయడం మెప్పిస్తుంది. పతాక సన్నివేశాల్లో విలన్‌తో బాధిత జ్యోతి మాట్లాడే డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఇక చాలా హైతో కథకు ముగింపు పలికిన తీరు మెప్పిస్తుంది.
ఎవరేలా చేశారు:
మహారాజా పాత్రలో విజయ్ సేతుపతి జీవించారు. ఆద్యంతం తన నటనతో కట్టిపడేశాడు. ఇక లక్ష్మిని వెతికి పెట్టాలంటూ ఆయన అమాయకత్వంతో చేసే యాక్టింగ్ నవ్వులు తెప్పిస్తుంది. అలాగే తన కూతురికి అన్యాయం చేసిన వాళ్లను చంపే సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా పండాయి. జ్యోతి పాత్రలో సచిన నటన మెప్పిస్తుంది. పతాక సన్నివేశాల్లో చాలా అద్భుతంగా నటించింది. విలన్ పాత్రలో అనురాగ్ కశ్యప్ అదరగొట్టాడు. మమతా మోహన్‌దాస్, భారతీరాజా, మణికందన్, అరుళ్దాస్ తదితరుల పాత్రలన్నీ మెప్పిస్తాయి
సాంకేతిక అంశాలు:
దర్శకుడు కథను నడిపించిన తీరు బాగుంది. కొంచెం స్క్రీన్ ప్లే ఫార్మెట్‌ను అర్థం చేసుకోవాలి. భావోద్వేగాలను చాలా బాగా తీసుకున్నాడు. యాక్షన్, కామెడీ అన్ని విధాలుగా మెప్పించాడు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ విషయంలో కొంత అసంతృప్తి ఉంటుంది కానీ సినిమా నెరషన్ సైతం స్లోగానే ఉండడంతో ఎడిటర్ మాత్రం ఏం చేయగలడు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.