Pawan Kalyan : ఉప ముఖ్య మంత్రి పదవికి పవన్ సుముఖత?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నేషనల్ మీడియా ఈ మేరకు వార్తలు ప్రచురించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan Kalyan Interested in Deputy CM Post: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల నుంచి వంద శాతం విజయాలు నమోదు చేసి తన సత్తాను నిరూపించుకున్నారు జనసేన(JSP) అధినేత పవన్ కళ్యాణ్(PAWAN KALYAN). ఈ క్రమంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నేషనల్ మీడియా అయిన ఇండియా టుడే ఆదివారం వార్తలను ప్రచురించింది.
ఆదివారం దిల్లీలో మూడో సారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా హాజరయ్యారు. ఆ సందర్భంలో ఇండియా టుడే రిపోర్టర్ పవన్ కళ్యాణ్‌తో మాట్లాడారు. అప్పుడు విలేకరి అడిగిన ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. అయితే అక్కడ పవన్ మాట్లాడింది కొంత అస్పష్టంగా వినిపించలేదు.
అయినా ఇది జరిగిన కొంత సేపటికి ఇండియా టుడేలో పవన్ కళ్యాణ్(PAWAN KALYAN) ఉప ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించాలని అనుకుంటున్నట్లు వార్తలు వెలువడ్డాయి. స్క్రోలింగ్‌లు కూడా వచ్చాయి. జూన్ 12 చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రభుత్వాన్నీ ఏర్పాటు చేస్తారు. దీంతో ఉప ముఖ్యమంత్రి విషయం అధికారికంగా తొందరలోనే వెల్లడికానుంది.