Elections 2024 : లోక్ సభ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు మరీ ఇంత తక్కువా?
ప్రస్తుతం ఏడు దశల్లో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళలు పది శాతం లోపేనని ఏడీఆర్ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Lok Sabha Elections 2024 : భారత దేశ వ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థుల(WOMEN CANDIDATES) సంఖ్య వందల్లోనే ఉంది. దేశ వ్యాప్తంగా మొత్తం 8,360 మంది ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అయితే అందులో కేవలం 797 మంది మాత్రమే మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఇది మొత్తంలో చూసుకుంటే పది శాతం లోపేనని ఏడీఆర్ వెల్లడించింది.
కేంద్ర ఎన్నికల సంఘం అభ్యర్థుల సంఖ్యపై తాజాగా వివరాలను వెల్లడించింది. ఇప్పటి వరకు ఐదు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. ఆ పోలింగ్లో మొత్తం 6,587 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇంకా మరో రెండు దశల ఎన్నికలు జరగనున్నాయి. తర్వాత జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. దేశ వ్యాప్తంగా 2014లో జరిగిన ఎన్నికల్లో 8,251 మంది, 2019లో 8,054మంది, 2024లో అత్యధికంగా 8,360 మంది అభ్యర్థులు లోక్ సభ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు.
దేశంలో మహిళా బిల్లు ఆమోదం పొందిన తర్వాత జరుగుతున్న తొలి లోక్ సభ ఎన్నికలు ఇవే. దాదాపుగా 27 ఏళ్లుగా పెండింగులో ఉన్న ఈ మహిళా బిల్లు ఎట్టకేలకు ఆమోదం లభించింది. అయితే ఇంత వరకు అది అమల్లోకి రాలేదు. ఒక వేళ ఆ బిల్లు అమల్లోకి వస్తే లోక్ సభ, రాష్ట్రాల ఎన్నికల్లో సైతం మహిళలకు(WOMENS) మూడో వంతు సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. బిల్లు పాసైంది కాబట్టి ఇంకా అమల్లోకి రాకపోయినా మహిళలకు సీట్లు కేటాయించి ఉండాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.