»Huge Rush Of Devotees At Chilkur Temple For Garuda Prasad
CHILKURU BALAJI TEMPLE : తల్లికాని మహిళలకు గరుడ ప్రసాదం.. చిలుకూరు ఆలయానికి భారీగా భక్తులు
తల్లికాని మహిళల కోసం గరుడ ప్రసాదాన్ని వితరణ చేస్తారని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో చిలుకూరు బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వచ్చారు. దీంతో ఆ రోడ్డులో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయ్యింది.
CHILKUR BALAJI TEMPLE : చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారిని దర్శించుకునేందుకు శుక్రవారం పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు. హైదరాబాద్ నుంచే కాకుండా ఆ చుట్టుపక్కల పలు ప్రాంతాల నుంచి భారీగా భక్తులు వస్తున్నారు. దీంతో ఆలయానికి వెళ్లే మార్గంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం అయి పలువురు ఇబ్బందులకు గురవుతున్నారు. దాదాపుగా 30 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయి వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
చిలుకూరు బాలాజీ ఆలయంలో(Chilkur Balaji Temple) బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంతానం లేని మహిళలకు గరుడ ప్రసాద వితరణ జరుగుతుందని సోషల్మీడియాలో బాగా ప్రచారం జరిగింది. దీంతో ఎన్నడూ లేనంతగా భారీగా జనం ఆలయానికి క్యూ కట్టారు. దాదాపుగా లక్ష మంది వరకు ఆలయానికి కార్లు, ఇతర వాహనాల్లో చేరుకున్నారని సమాచారం.
ఈ విషయమై మెయినాబాద్ సీఐ పవన్ కుమార్ రెడ్డి మాట్లాడారు. చిలుకూరు బాలాజీ ఆలయానికి(Chilkur Balaji Temple) తెల్లవారు జాము నుంచి ఉదయం పదిన్నర గంటలలోపు 60 వేల మందికి పైగా భక్తులు వచ్చారని తమకు సమాచారం ఉందన్నారు. ఆలయం దగ్గర ఉదయం కొంత సమయం వరకు గరుడ ప్రసాదం(Garuda Prasad) ఇచ్చారని తర్వాత వితరణ ఆపివేశారని తెలిపారు. ఆలయ అధికారులు ఈ ప్రసాదం కోసం ఐదు వేల మంది వరకు వస్తారని అంచనా వేశారన్నారు. అయితే ఊహించని రీతిలో ఇంత పెద్ద ఎత్తున జనం రావడంతో చిలుకూరు రోడ్డులో భారీగా ట్రాఫిక్ జాంలు అయినట్లు తెలిపారు. దీంతో ఉదయాన్నే ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లే వారికి చాలా ఇబ్బందుకలు తలెత్తాయని చెప్పారు. ఈ మార్గం గుండా రావడానికి ఎవరూ ప్రయత్నించవద్దని విజ్ఞప్తి చేశారు.