Exercise : ఇలా చేస్తుంటే జిమ్ముకెళ్లాల్సిన పనే లేదు
రోజువారీ జీవితంలో ఎవ్వరైనా సరే వ్యాయామానికి సమయం కేటాయించాల్సిందే. అయితే అంతటి సమయం చాలా మందికి ఉండదు. అలాంటి వారు ఏం చేయొచ్చో నిపుణులు ఇక్కడ సూచిస్తున్నారు.
Without Gym Exercise : రోజూ మనకు ఎన్ని పనులు ఉన్నా సరే కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాల్సిందే. లేదంటే బరువు పెరగడం, దీర్ఘకాలిక వ్యాధులు రావడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే కొంత మందికి జిమ్ములకు(gym) వెళ్లి వ్యాయామాలు చేయడానికి, గ్రౌండ్లకు వెళ్లి జాగింగ్లు, వాకింగ్లు చేయడానికి అంత సమయం చిక్కదు. అందుకనే వారు వీటిని చేయకుండా సమయం గడిపేస్తుంటారు. అయితే ఇలాంటి వారు రోజు వారీ జీవితంలో చేసే పనుల ద్వారానే వ్యాయామాన్ని చేయవచ్చు. అదెలాగో నిపుణులు ఇక్కడ చెబుతున్నారు తెలుసుకుందాం రండి.
అపార్ట్మెంట్లలో నివసించే వారు పై అంతస్థులకు ఎక్కడానికి లిఫ్టులు ఎక్కుతుంటారు. అయితే వారు ఆ పని చేయకుండా చక్కగా మెట్లు ఎక్కి, దిగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల సాధారణంగానే ఎక్కువ క్యాలరీలు కరుగుతాయి. జిమ్ములకు వెళ్లక్కర్లేకుండానే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అలాగే రోజూ చిన్న చిన్న పనుల కోసం చుట్టుపక్కల దుకాణాలకు బండి మీద వెళుతుంటారు. అలా చేయకుండా కాలి నడకన వెళ్లండి. బరువైన సంచులన్నీ మోయండి. వ్యాయామం చేసినంత ఫలితాన్ని పొందండి.
ఇలాగే కాస్త సమయం దొరికినప్పుడల్లా ఇంట్లో కష్టపడి చేసుకునే పనులన్నింటినీ మిషన్ల సహకారం లేకుండా మీరే చేసుకోండి. అంటే మిక్సీలు లేకుండా పప్పులు రుబ్బడం, వాషింగ్ మిషన్లు లేకుండా బట్టలు ఉతకడం లాంటివి చేస్తూ ఉంటే జీవ క్రియ దానంతట అదే వేగవంతం అవుతుంది. శరీరం ఎక్కువ క్యాలరీలను కరిగిస్తుంది. దీంతో వ్యాయామం(exercises) చేయకుండానే ఆ ఫలితాన్ని పొందగలుగుతారు. స్కిప్పింగ్ చేయడం, డ్యాన్స్ చేయడం లాంటి వాటి వల్లా ప్రయోజనాలు ఉంటాయి.