Amitabh Bachchan: బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గుండెకు సంబంధించిన నొప్పితో బాధపడుతూ యాంజియోప్లాస్టీ సర్జరీ కోసం బిగ్ బి ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలను అమితాబ్ ఖండించారు. శుక్రవారం ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌కు హాజరయ్యారు. అక్కడ మీడియా వర్గాలు అమితాబ్ మీ ఆరోగ్యం ఎలా ఉందని అడగ్గా.. బాగున్నానని.. నా అనారోగ్యంపై వస్తోన్న వార్తలన్నీ ఫేక్ అని తెలిపారు.
అమితాబ్ ఐఎస్పీఎల్ ఫైనల్స్‌లో హుషారుగా పాల్గొని సందడి చేశారు. సచిన్ టెండూల్కర్‌తో కలిసి మ్యాచ్ చూశారు. అమితాబ్ ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటిస్తున్నారు. ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతోన్న కల్కి 2898 ఏడీలో కీలకపాత్రలో కనిపించనున్నారు. మే9న ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. టి.జి. జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తోన్న తలైవా 170లోనూ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.