ENG vs IND: ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రోహిత్ సేన అదరగొట్టింది. 4-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. చివరిదైన ఐదవ టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్ జట్టును చిత్తుచేసింది. రవిచంద్రన్ అశ్విన్ మరోసారి చెలరేగి ఇంగ్లిష్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. మరోసారి ఐదు వికెట్లు తీసి ప్రత్యర్ధి జట్టును చావుదెబ్బ తీశాడు. తన 100వ టెస్టును చిరస్మరణీయంగా ముగించాడు. చివరి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు పూర్తిగా వైఫల్యం చెందారు. తొలి ఇన్నింగ్స్ లో 218 పరుగులు చేసిన ఇంగ్లండ్ జట్టు, రెండో ఇన్నింగ్స్ లో ఆ మాత్రం పరుగులు కూడా చేయలేకపోయింది. కేవలం 195 పరుగులకే కుప్పకూలింది. ఘోర పరాజయం చవిచూసింది.
ఇంగ్లండ్ తరపున జో రూట్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 84 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు 195 పరుగులకే ఆలౌట్ అయింది. చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్ .. రెండో ఇన్నింగ్స్ లో కూడా తన తడాఖా చూపించాడు. ఏకంగా ఐదు వికెట్లు తీశాడు. జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలి పాప్, బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్ వికెట్లను పడగొట్టి ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బ కొట్టాడు. తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించిన ఇంగ్లండ్ అక్కడి నుంచి తడబడింది. తర్వాతి నాలుగు టెస్టు మ్యాచులను ఓడిపోయింది. రోహిత్ సేన అద్భుత ఆటతీరుతో ఇంగ్లండ్ జట్టుకు కళ్లెం వేసింది. కోలుకోలేని దెబ్బ తీసింది. ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌కు మాత్రమే ఈ టెస్టు సిరీస్ చిరస్మరణీయంగా నిలిచింది. టెస్టు మ్యాచుల్లో 700 వికెట్లు పడగొట్టిన అరుదైన ఘనతను ఆండర్సన్ సొంతం చేసుకున్నాడు.
That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏