»High Protein Snacks That Are Healthy And Portable
High Protein Snacks : చిరుతిండ్లుగా వీటిని తింటే బోలెడు ప్రొటీన్లు
చాలా మంది చిరుతిండ్లను ఎంచుకునేప్పుడు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోరు. ఈ సమయంలో జంక్ ఫుడ్స్‌కి బదులు ప్రొటీన్లు ఎక్కువగా ఉండే వాటిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
High Protein Snacks : సాయంత్రం నాలుగు కాగానే మనకు ఏదో ఒకటి తినాలని అనిపిస్తూ ఉంటుంది. అప్పుడే మనకు పకోడీలు, సమోసాలు, టీ లాంటివన్నీ గుర్తొస్తాయి. పిల్లలైతే చిప్స్, ప్యాక్డ్ ఆహారాలను తిని లేని పోని చెత్త అంతా శరీరంలోకి పంపిస్తూ ఉంటారు. ఇలాంటివి మన ఆరోగ్యంపై దుష్రభావాలను చూపిస్తాయి. వీటికి బదులుగా ఈ సమయంలో మంచి ప్రొటీన్ రిచ్ ఆహారాలను తీసుకోవడానికి ప్రయత్నించండి. అందుకు బోలెడు ఆప్షన్లు ఇక్కడున్నాయి. ఓసారి చూసేయండి.
సాయంత్రపు స్నాక్(Snack) టైంలో మొలకలను తినడం వల్ల బోలెడు పోషకాలు మీ శరీరానికి అందుతాయి. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలని అనుకుంటున్న వారు వీటిని నిరభ్యంతరంగా కావల్సినన్ని తినొచ్చు. వీటిలో ఉండే డైటరీ ఫైబర్ల వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. పేగులకు ఆరోగ్యాన్ని చేకూర్చాలంటే సాయంత్రపు స్నాక్‌గా ఓ కప్పుడు పెరుగును తినండి. నేరుగా అయినా తినొచ్చు. లేదంటే కొన్ని గింజలు, బెర్రీల్లాంటి వాటిని వేసుకుని అయినా తినొచ్చు. దీనిలో ఉండే ప్రోబయోటిక్ లక్షణాల వల్ల పేగులకు ఉపయోగకరంగా ఉంటుంది. పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా దీని వల్ల వృద్ధి చెందుతుంది.
నట్స్, జీడిపప్పు, బాదం, కిస్మిస్, వాల్నట్స్, అంజీరా లాంటి అన్నింటినీ రెండు రెండు చొప్పున తీసుకుని రోజూ తినవచ్చు. బాదం, వాల్నట్స్ లాంటి వాటిని నానబెట్టుకుని తినడం వల్ల తేలికగా జీర్ణం అవుతాయి. ఉడకబెట్టిన శెనగల్లో కాస్త నిమ్మరసం పిండుకుని తినండి. ఇది మనకు మంచి స్నాక్. కొంచెం తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంట్లో ఎక్కువగా ప్రొటీన్లు, పీచు పదార్థాలు ఉంటాయి. అనేక పోషకాలు లభిస్తాయి. కాబట్టి ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఫూల్ మఖానాని వేపించి వాటిని చిరు తిండిలా తినొచ్చ. వీటిని వేడి చేయడం వల్ల ఇవి ఉబ్బుతాయి. చిప్స్ మాదిరిగా తయారవుతాయి. దీంతో పిల్లలు వీటిని ఇష్టంగా తింటారు. చిప్స్, పాప్‌కార్న్ లాంటి వాటికి ప్రత్యామ్నాయంగా వీటిని మనం వారికి ఇవ్వవచ్చు. వీటిలో ప్రొటీన్లు, జింక్, మెగ్నీషియం, పొటాషియం, ఇతర ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.