కేరళ (Kerala)లో లాటరీలు రూ.కోట్లు కురిపిస్తున్నాయి. టికెట్ కొన్నవారికి కళ్లుచెదిరే ప్రైజ్ మనీని కట్టబెడుతున్నాయి. వందలు పెడితే రూ.కోట్లు వచ్చిపడుతున్నాయి కాబట్టి సాధారణంగానే దీనిపై అందరికీ ఆసక్తి ఉంటుంది. ఇటీవల ఈ ఆసక్తి ఇంకా ఎక్కువైంది. దేశవ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది. తాజాగా కేరళకు చెందిన పదకొండు మంది మహిళలను అదృష్టం అనూహ్యంగా వరించింది. రాత్రికి రాత్రే వారందరూ లక్షాధికారులైపోయారు. రూ.250ల లాటరీ (Lottery) టిక్కెట్టును 11 మంది కలిసి మరీ కొనుక్కుని చివరకు రూ.10 కోట్లు గెలుచుకున్నారు. పరప్పనన్‌గడీ (Parappanangadi) మున్సిపాలిటీకి చెందిన హరిత కర్మ సేనకు చెందిన ఈ మహిళలు స్థానికంగా నాన్ బయోడిగ్రేడబుల్ (Biodegradable) వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ ప్లాంట్‌కు తరలిస్తుంటారు.
అలా వచ్చే కొద్ది పాటి ఆదాయమే వారి జీవనాధారం, వారి కుటుంబాలకున్న ఏకైక ఆదాయ వనరు.ఇటీవల టిక్కెట్టు కొనుక్కునే సమయానికి వారి వద్ద కనీసం పాతిక రూపాయలు కూడా లేని దీన పరిస్థితి.దీంతో, కొందరు అప్పు చేసి మరీ మొత్తం రూ.250తో ఓ లాటరీ టిక్కెట్టు కొనుక్కున్నారు.కేరళ లాటరీ డిపార్టుమెంటు (Lottery Department) లాటరీ నిర్వహించగా వీరికి రూ.10 కోట్ల విలువైన మానసూన్ బంపర్ లాటరీ దక్కింది. దీంతో, ఆ మహిళల ఆనందానికి అంతేలేకుండా పోయింది. తాము లైఫ్(life)లో చాలా కష్టాలు పడుతున్నామని, ఈ డబ్బుతో కొంతమేర కష్టాలు తీరుతాయని హర్షం వ్యక్తం చేశారు. రాత్రికిరాత్రి లక్షాధికారులైన వీరికి బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.