నులక మంచం ఈ పేరు చెబితే పాతకాలం నాటి జనాల ప్రాణం లేచివస్తుంది. ఒకప్పుడు ఈ నులక మంచాలు ప్రతీ ఇంట్లో ఉండేవి. సాయంత్రం అయితే చాలు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా వాకిట్లో, పెరట్లో ఈ మంచాన్ని వేసుకుని చల్ల గాలికి సేదతీరేవారు. ఇది ఇంట్లో, బయట, అరుగులమీద సులభంగా వేసుకుని కూర్చోవడానకి, పడుకోవడానికి తేలికగా, దృడంగా ఉండేది. కాలక్రమంలో నులక మంచం మూలనపడింది. ఇప్పుడు గ్రామాల్లో కూడా నులక మంచాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.
అనూహ్యంగా నులక మంచాలు అమెరికాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆన్ లైన్ పోర్టల్ లో అమ్మకానికి పెట్టడమే ఆలస్యం కొనేస్తున్నారు . మామూలుగా నులకమంచం భారత్ లో 10 నుంచి 20వేల రూపాయలు ధర ఉండవచ్చు. అమెరికాలో అయితే దీని ధర లక్షరూపాయల పైనే అంటే నమ్మండి. ఆశ్యర్యంగా అనిపిస్తున్నా ఇది నమ్మాల్సిన నిజమే. వివిధ రంగులతో చేసిన నవారుతో కూడిన మంచాలు, స్టూళ్లు కూడా అత్యధిక ధరకు హట్ కేకుల్లా అక్కడ అమ్ముడవుతున్నాయి.
భారతీయ మంచాలు అంటూ ఆన్ లైన్ లో సేల్ కు పెట్టగానే వినియోదారులు కొనేస్తున్నారు. Etsy అనే వెబ్ సైట్ దేశీయ మంచాలను అమెరికాలో అమ్ముతోంది. ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. భారతీయ మంచాలను అమెరికన్లు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. అమ్మకాలు జోరుగా ఉండటంతో… స్టాక్ తక్కువగా ఉందన్న బోర్డులు చాలా సార్లు పెట్టినట్లు తెలిపారు.