Fish Festival : తెలంగాణ వ్యాప్తంగా జూన్ 8న ఫిష్ ఫుడ్ ఫెస్టివల్
మృగశిర కార్తీక మాసం ప్రారంభం రోజున ఈ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్‌ను ప్రారంభించనున్నట్లుగా మంత్రి తలసాని (Minister Talasani) తెలిపారు. కాగా రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కొర్రమీను చేపను తెలంగాణ రాష్ట్ర చేపగా ప్రభుత్వం గుర్తించింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఫిష్ పుడ్ ఫెస్టివల్ (Fish Food Festival) నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మృగశిర కార్తె సందర్భంగా జూన్ 8, 9, 10 తేదీలలో అన్ని జిల్లా కేంద్రాలలో నిర్వహించనున్న ఫిష్ పుడ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రి తలసాని (Minister Talasani) సమీక్షించారు. చేపలకు సంబంధించిన అన్ని రకాల వంటకాలు ఫెస్టివల్ లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో గణనీయంగా మత్స్య సంపద పెరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ (CM KCR) చొరవతో రాష్ట్రంలో ఉచితంగా చేప పిల్లల పంపిణీ జరుగుతుందని ఆయన తెలిపారు.
రాష్ట్ర పదో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా జూన్ 8వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించాలని మత్స్యశాఖ (Department of Fisheries) నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో దీన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో 20 నుంచి 30 రకాల చేపల వంటకాలను ప్రదర్శించనున్నారు. ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణ, ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో చర్చించారు. ఫెస్టివల్ నిర్వహణకు అనువైన ప్రాంతాలు గుర్తించి ఏర్పాట్లు చేయాలని అధికారులను తలసాని ఆదేశించారు. ఈ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ లో చేపలతో తయారు చేసిన ఫిష్ ఫ్రై (Fish fry), కర్రీ, బిర్యానీవంటి అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా మత్స్యరంగానికి విశేష సేవలు అందించిన వారిని గుర్తించి సన్మానించాలని తెలిపారు.