YS Sharmila : పార్టీ విలీనంపై షర్మిల హాట్ కామెంట్స్
వైఎస్సార్ టీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఖండించారు. విలీనమే చేయాలనుకుంటే పార్టీ ఎందుకు పెడతానన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో పొత్తులు , విలీనంపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) హాట్ కామెంట్స్ చేశారు.విలీనమే చేయాలనుకుంటే పార్టీ ఎందుకు పెడతానన్నారు. తాను వెళ్లి ఏదైనా పార్టీలో విలీనం చేయాలని భావిస్తే వద్దనే వాళ్లే లేరని, అయినా పార్టీని విలీనం చేయడానికి స్థాపించలేదని ఆమె వెల్లడించారు. మంగళవారం లోటస్ పాండ్(Lotus Pond)లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీ విలీనం, రాబోయే ఎన్నికల్లో పొత్తుల అంశంపై పలు విషయాలను వైఎస్ షర్మిల వెల్లడించారు. వైఎస్సార్ టీపీ (YSR TP) కాంగ్రెస్లో విలీనం లేదా పొత్తు పెట్టుకోబోతోందనే ప్రచారంపై రియాక్ట్ అవుతూ.. కాంగ్రెస్ పార్టీకి 2014, 2018లో ఎన్ని సీట్లు వచ్చాయో అందరికి తెలుసని, సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోలనే స్థితిలో కాంగ్రెస్ ఉందని విమర్శించారు. ఇది ఆ పార్టీ నాయకత్వ లోపమేనని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ౼ వైఎస్సార్ = 0 ఇది కాంగ్రెస్ పరిస్థితి అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్(Congress)కు గతంలో లీడర్ షిప్ ఉండేదని, కానీ వారికి ఇప్పుడు ఆ సత్తా లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితే బాగోలేదని.. 19 మంది ఎమ్మెల్యేలే గెలిస్తే.. ప్రస్తుతం ఐదుగురు మాత్రమే ఉన్నారని.. గెలిచిన ఎమ్మెల్యేలను నిలుపుకోలేని నాయకత్వం లోపం ఉందన్నారామె. పార్టీ నుంచి వెళ్లిన వాళ్లను తిరిగి తీసుకొచ్చే సత్తా ఆ పార్టీకి ఉందా అని ప్రశ్నించారు. జాతీయ సంస్థ చేసిన సర్వేలో తెలంగాణ(Telangana)లో 43 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ టీపీ ప్రభావం చూపిస్తుందని రిపోర్టులు వచ్చాయని షర్మిల చెబుతున్నారు. అలాంటప్పుడు 10, 20, 30 సీట్ల కోసం పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు . తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్న ఏకైక పార్టీ మాదే అని.. ఎవరి దగ్గర సీట్ల కోసం తగ్గాల్సిన అవసరం లేదన్నారామె. షర్మిల అంటే తెలియని వాళ్లు ఎవరూ లేరని.. మా పార్టీ బలంగా ఉందన్నారు. తనకు మిస్ డ్ కాల్స్ వస్తున్నాయని.. ఆ విషయాలు తర్వాత వెల్లడిస్తామన్నారు వైఎస్ షర్మిల.మరో వైపు కర్ణాటక (Karnataka) కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ (DK Sivakumar) ను షర్మిల బెంగళూరులో కలిశారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సందర్భంగా అభినందించారు.