రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు, మహిళలకు రూ.2500, ఇందిరమ్మ ఇళ్లు, రూ.500కు గ్యాస్ అంశాలపై పీఏసీ సమావేశంలో చర్చించారు. గాంధీభవన్లో రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ ఠాక్రే అధ్యక్షతన పీఏసీ సమావేశం జరగగా.. ఆ వివరాలను షబ్బీర్ అలీ మీడియాకు వెల్లడించారు.
Shabbir Ali: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్ (Revanth) సర్కార్ దృష్టి సారించింది. ఆరు హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టంచేశారు. సోమవారం గాంధీభవన్లో కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన పీఏసీ సమావేశం జరిగింది. కీలకమైన రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు, మహిళలకు రూ.2500, ఇందిరమ్మ ఇళ్లు, రూ.500కు గ్యాస్ అంశాలపై పీఏసీ సమావేశంలో చర్చించారు. ఆ వివరాలను మీడియాకు షబ్బీరీ అలీ వెల్లడించారు.
పలు అంశాలపై చర్చించామని.. మూడు అంశాలపై తీర్మానం చేశామని షబ్బీర్ అలీ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామి అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రచారానికి వచ్చిన ఏఐసీసీ అగ్రనేతలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ లోక్ సభకు పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశామని వివరించారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వివరించారని షబ్బీర్ అలీ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో చర్చిస్తామని వివరించారు. మిషన్ భగీరథ అవకతవకలపై చర్చించామని పేర్కొన్నారు. ఈ నెల 28వ తేదీ నంచి గ్రామ సభలు నిర్వహిస్తామని.. వాటిల్లో అర్హులను ఎంపిక చేస్తామని తెలిపారు. అదేవిధంగా లోక్ సభ ఎన్నికల కోసం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇంచార్జీలను నియమిస్తామని తెలిపారు.