తన కూతురు కవితను పార్టీ మారమని కోరారంటూ ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు గుర్తుండే ఉంటాయి. ఇవే మాటలను కవిత కూడా చెప్పారు. తనను పార్టీ మారమని బీజేపీ నేతలు సంప్రదించారంటూ కవిత చేసిన కామెంట్స్ ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. కాగా… ఈ విషయంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.
కవితను పార్టీ మారమని కోరిందెవరో తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో సిట్ దర్యాప్తు చేయాలని కోరారు. కవిత స్టేట్మెంట్ రికార్డు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు.
ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని దర్యాప్తు చేయాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. కవితను సిట్ ఆఫీస్కు పిలిచి ఎవరు పార్టీ మారమన్నారో స్టేట్మెంట్ రికార్డు చేయాలని కోరారు. ఎమ్మెల్యేలకు ఎర కేసు తరహాలో దర్యాప్తు జరుపాలన్నారు. టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై అధికారులను ఉపయోగించుకొని కేసులు నమోదు చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజలందరూ ఈ రెండు పార్టీల గురించి చర్చించుకోవాలనే వ్యూహాత్మక కుట్రలో భాగంగానే దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.