HNK: పాఠశాల రెన్యువల్ కోసం రూ. లక్ష డిమాండ్ చేసిన అదనపు కలెక్టర్, ఇంఛార్జ్ డీఈవో వెంకటరెడ్డి, సిబ్బంది గౌస్, మనోజ్‌ను పట్టుకోవడానికి బాధితుడే తమకు సమాచారం ఇచ్చారని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. రూ.60,000 లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామన్నారు. అధికారులు ఎవరైనా లంచం అడిగితే ఏసీబీకి తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
MDK: సదాశివపేట మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెద్దాపూర్ గ్రామానికి చెందిన మార్గం నర్సమ్మ (42) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లగా, ఆమె భర్త మార్గం సత్తయ్య పలు ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో శుక్రవారం గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రం వద్ద విగత జీవిగా కనిపించింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
WNP: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తొలివిడత ఎన్నికలు జరిగే మండలాల్లో డిసెంబర్ 8న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. శుక్రవారం రేవల్లిలో మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి ఎన్నికల నిర్వహణను పరిశీలించారు.
KMR: బాన్సువాడలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల (తాడ్కోల్)లో పీజీటీ ఇంగ్లీష్ బోధించటానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. పార్ట్ టైం బేసిక్‌గా బోధించటానికి ఎంఏ ఇంగ్లీష్ బీఈడీ విద్యా అర్హత కలిగిన మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలో సంప్రదించాలన్నారు.
NZB: టెట్ మినహాయింపు అంశంపై ఉపాధ్యాయుల సంఘాలతో PRTU భవనంలో శుక్రవారం సాయంత్రం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. 2010 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులను టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ నుంచి మినహాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వివిధ సంఘాల నాయకులు కోరారు. అదేవిధంగా నిరుద్యోగులకు నిర్వహిస్తున్న టెట్ కులాల వారీగా చూడొద్దన్నారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు శని, ఆదివారాలు (డిసెంబర్ 6, 7) వారంతపు సెలవుల కారణంగా మార్కెట్ శాఖ అధికారులు సెలవు ప్రకటించారు. ఈ రెండు రోజుల్లో మార్కెట్‌లో క్రయవిక్రయాలు జరగవని తెలిపారు. తిరిగి ఈ నెల 8వ తేదీ (సోమవారం) నుంచి క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని అన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు.
SRCL: ముస్తాబాద్ మండల కేంద్రంలోని సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేయడానికి వచ్చి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గణేష్ తెలిపారు. సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేసేందుకు వెళుతూ గుంపులు గుంపులుగా రోడ్ల పైన ర్యాలీ చేశారు. వాహనదారులకు ఇబ్బందులు కలిగించి నామినేషన్ సెంటర్‌కు వంద మీటర్లలోపు గుంపులుగా ఏర్పడి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు.
JGL: ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన ట్రాన్స్ జెండర్ శ్రీప్రేమ గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా తమ గ్రామంలోని 9వ వార్డుకు నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ అభివృద్ధి, శుభ్రత, పేదల సంక్షేమం, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రతి అర్హులైన కుటుంబానికి చేరవేయాలని లక్ష్యంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రేమ తెలిపారు.
KNR: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌గా కరీంనగర్‌కు చెందిన అంబటి జోజి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ ప్రధాన కార్యదర్శి దేవరాజన్ తెలిపారు. పార్టీ బలోపేతం, సంస్థాగత విస్తరణ, సభ్యత్వ పునరుద్ధరణపై చర్చించారు.
RR: HYDలోని బషీర్‌బాగ్‌లోని SC, ST కమిషన్ కార్యాలయంలో మంచాల CIపై గడ్డం సరోజ ఆమె కుమారుడు యాదగిరి ఫిర్యాదు చేశారు. జైనమ్మగూడ గ్రామ సర్వే నంబర్ 44లోని వారి భూమి కబ్జా చేసిన వారికి సహకరిస్తూ, CI తమను బెదిరించారని, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ (DI) కూడా వారికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. అధికారులపై చర్యలు తీసుకుని, కబ్జాదారులను శిక్షించాలని కోరారు.
JGL: జగిత్యాల పట్టణంలోని 34, 35, 44 వార్డులలో రూ. 26 లక్షల వ్యయంతో టవర్ నుంచి గీతాభవన్ రోడ్డు వరకు చేపట్టనున్న బిటి రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్లు గిరి నాగభూషణం, అడువాల జ్యోతి లక్ష్మణ్, గోలి శ్రీనివాస్, కమిషనర్ స్పందన, డిఈ సతీష్, మాజీ కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు.
JGL: జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 7 మండలాల్లోని 122 గ్రామ పంచాయతీలు, 1172 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 4 సర్పంచ్ స్థానాలు, 349 వార్డు మెంబర్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.సత్యప్రసాద్ తెలిపారు.
BHNG: భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని మందుల కుల స్టేట్ ప్రెసిడెంట్ సింగజోగి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఓరుగంటి రమేష్, మీడియా ఇన్‌ఛార్జ్ సింగాజోగి గిరి జగ్గయ్య శుక్రవారం కలిశారు. మందుల కుల సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడాలని, త్వరగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని వారు ఎమ్మెల్యేను కోరారు.
పెద్దపల్లి జిల్లా నిబంధనల ప్రకారం పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. శుక్ర వారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 6న పీవో, ఎపీవోలకు శిక్షణ అందిస్తున్నామన్నారు.
SRPT: కోదాడలోని మీసేవ కేంద్రాన్ని ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ మీసేవ కమిషనర్ టి. రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సేవల నిర్వహణ, రుసుముల వసూళ్లు, టోకెన్ విధానం, డిజిటల్ రికార్డులు తదితర అంశాలను ఆయన సమగ్రంగా పరిశీలించారు. రిజిస్టర్ పరిశీలన, లాగిన్ రిపోర్టులు, పని వేళల్లో పారదర్శకత, వేగవంతమైన సేవలపై ఆయన సిబ్బందిని ప్రశ్నించారు.