JGL: రాయికల్ మండలంలోని ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే. కాగా, సోమవారం సాయంత్రం జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన నూతన సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
SDPT: జిల్లాలో జరగనున్న మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హైమావతి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్లో ఆర్డీవోలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో ఆమె జూమ్ సమావేశం నిర్వహించారు. మూడో విడతలో 9 మండలాల్లోని 163 గ్రామ పంచాయతీలు, 1432 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు.
KMM: సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ప్రారంభమైన ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ పేరుతో నిర్వహిస్తున్న సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాలపై రూపొందించిన అవగాహన పోస్టర్లను ఇవాళ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం అదనపు డీసీపీ, సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణిందర్, ఇన్‌స్పెక్టర్ కొండపర్తి నరేష్ పాల్గొన్నారు.
NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని హర్యనాయక్ తండా గ్రామంలో కొర్ర శిరీష కృష్ణ నాయక్ (23)అతి చిన్న వయస్సులోనే సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గ్రామ పంచాయతీలకు రెండో విడత నిర్వహించిన ఎన్నికలలో ఆమె బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసి ప్రత్యర్థి అభ్యర్థిపై 78 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి సత్తా చాటారు. పిన్న వయస్సులో సర్పంచ్‌గా ఎన్నికై రికార్డు సృష్టించారు.
NGKL: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ చారకొండ మండలంలోని పలు గ్రామాలలో సోమవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని తిమ్మాయిపల్లి సర్పంచ్ అభ్యర్థి రంగినేని రామేశ్వరమ్మకు మద్దతుగా ఆయన గ్రామంలో ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు.
BDK: పాల్వంచలోని ఆత్మలింగేశ్వర స్వామి ఆలయంను ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువులు జగద్గురు ద్వారాచార్య, మలూక్ పీఠాధిస్వర్లు సోమవారం దర్శనమిచ్చారు. రాజమండ్రి నుంచి పాల్వంచకు వచ్చిన 600 మంది సాధువులకు ఆలయ ధర్మకర్త మచ్చా శ్రీనివాసరావు ఘన స్వాగతం పలికారు. సాధువుల రాకతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.
GDWL: గద్వాల పట్టణం వేదనగర్‌లో వరుస దొంగతనాలు ప్రజలను భయపెడుతున్నాయి. శనివారం పట్టపగలు ఓ ఇంట్లో తాళాలు పగలగొట్టి దొంగతనం జరిగిన సంఘటన మరవకముందే సోమవారం అదే ఇంటి పక్కన నివాసముండే తిరుమల బుచ్చయ్య ఇంటికి తాళం పగలగొట్టి దొంగలు మళ్లీ దొంగతనానికి పాల్పడ్డారు. పట్టపగలు ఇళ్లకు తాళం వేసి ఎక్కడికైనా వెళ్లాలంటే వేదనగర్ వీధి ప్రజలు భయపడుతున్నారు.
RR: కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మాజీ మేయర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా మహేశ్వరం, కందుకూరు మండలాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులను ఆశీర్వదించాలని అన్నారు.
BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో సోమవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్ష పుష్పార్చన శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. అర్చక బృందం, వేద పండితులు స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో వివిధ పూలతో పూజలు చేశారు. పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం రెండు గంటలపాటు కొనసాగిన ఈ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
NZB: ఆర్మూర్ మండలం మగ్గిడి ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థిని అమూల్య (జీజీ కాలేజీ) జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు పీడీ మధుసూదన్ ఒక ప్రకటనలో తెలిపారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు జరుగుతున్న జూనియర్ జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో అమూల్య పాల్గొంటున్నట్లు తెలిపారు.
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారిని ఇటీవల విడుదలైన మోగ్లీ మూవీ యూనిట్ దర్శించుకుంది. ఈ సందర్భంగా హీరో రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి, మూవీ యూనిట్ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి.. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు వారిని సన్మానించి, శేషవస్త్రాలు అందజేశారు.
MLG: తాడ్వాయి- పస్రా మధ్య కొండపర్తి స్టేజీ సమీపంలో 3 కి.మీ దూరంలో గుట్టపై యాత్రికుల కోసం అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎత్తైన పెద్దగుట్టపై రూ.9 లక్షల కంపా నిధులతో పకోడాతో పాటు పలు నిర్మాణాలు చేపట్టారు. గుట్టపై ఏర్పాటు చేసిన టవర్ నుంచి చూస్తే చుట్టూ పచ్చని అడవి అందాలు చూడడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు.
జగిత్యాల జిల్లాలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు మూడవ ర్యాండమైజేషన్ విధానంలో ఎన్నికల సిబ్బంది కేటాయింపు పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బీ. సత్యప్రసాద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఈ ప్రక్రియ జరిగింది. 6 మండలాల్లో ఎన్నికల ఏర్పాట్లను జిల్లా నోడల్ అధికారులు మదన్ మోహన్, రేవంత్ వివరించారు.
SRD: గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగే ప్రభుత్వ పాఠశాలలకు ఈ నెల 17వ తేదీన సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గమనించాలని సూచించారు. 16వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ఎన్నికల అధికారులకు పాఠశాలలు అప్పగించాలని చెప్పారు.
BDK: ఆళ్లపల్లి మండలం అడవి రామవరం గ్రామపంచాయతీలో సీపీఐ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా ఇవాళ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండో విడతలో జిల్లా వ్యాప్తంగా సత్తా చాటినట్లు అదేవిధంగా మూడో విడతలో కూడా సీపీఐ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఎర్రజెండా ఐక్యతను చాటాలన్నారు.