PDPL: సుల్తానాబాద్‌లో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొన్నారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, ఇచ్చిన హామీలన్నీ ఎన్నికల నాటికి అమలు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమం, ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
SRD: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా శుభకార్యాలు, టూర్లకు వినియోగిస్తున్న స్కూల్ బస్సులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ టూర్ అండ్ ట్రావెల్స్ బస్ ఓనర్స్ అసోసియేషన్ జిల్లాకు చెందిన రవాణా శాఖ అధికారులను కోరింది. వీరి వలన తమ ఉపాధి దెబ్బతింటోందని తెలిపారు. విద్యార్థులకే పరిమితమైన బస్సులను కమర్షియల్ వినియోగానికి అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.
KMM: ప్రభుత్వ డయాగ్నస్టిక్ హబ్‌లో సాంకేతిక సమస్యలు రోగులకు శాపంగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యంత్రాల కాలం చెల్లడంతో నిత్యం జరిగే వేలాది పరీక్షలు నిలిచిపోయాయి. 2021 నుంచి లక్షలాది మందికి అండగా నిలిచిన ఈ కేంద్రం, నిర్వహణ లోపంతో ఉచిత సేవలు అందక సామాన్యులు ప్రైవేటు కేంద్రాలకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు.
KNR: హుజూరాబాద్ డంప్ యార్డ్ సమస్యపై జేఏసీ నాయకులు, మున్సిపల్ పాలకవర్గం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. వెస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ వల్ల ఈ ప్రాంతం కాలుష్యానికి గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డంప్ యార్డును తరలించాలని కోరగా, విషయం తన దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు.
ADB: క్రాంతివీర్ రాంజీ గోండ్ వర్ధంతి వేడుకలను ఈ నెల 9న ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గల హీరాసుఖ దేవస్థానం ఆవరణలో నిర్వహించనున్నట్లు వేడుకల నిర్వహణ కమిటీ కన్వీనర్ గెడం మనోహర్ పిలుపునిచ్చారు. మంగళవారం పర్దన్ భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఆదివాసీ 9 తెగల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
GDWL: ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు చదువులో రాణించాలి అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం ఉండవెల్లిలోని ప్రభుత్వ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, స్టోర్ రూమ్, భోజనశాలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు.
NGKL: జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులు తప్పనిసరిగా బీమా సౌకర్యం పొందాలని కార్మికాధికారి రాజ్ కుమార్ సూచించారు. మీ సేవలో రూ.110 చెల్లించి సభ్యత్వం తీసుకుంటే.. ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుని కుటుంబానికి రూ.10 లక్షలు, సాధారణ మరణానికి రూ.30 వేలు బీమా అందుతుందని తెలిపారు. కార్మికులు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
SDPT: కుకునూరుపల్లికి చెందిన రిటైర్డ్ CRPF DSP మహమ్మద్ ఖుత్బొద్దీన్ (62) మృతి పట్ల బీఆర్ఎస్ ఇంఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి ఆయన అందించిన సేవలు మరువలేనివని ఈ సందర్భంగా కొనియాడారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
GDWL: గద్వాల పట్టణ గౌరవానికి ప్రతీకలైన మహనీయుల విగ్రహాలను ప్రైవేటు విద్యాసంస్థలు తమ ప్రచార హోర్డింగ్‌లతో కప్పివేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే కృష్ణవేణి చౌరస్తాలో ఉన్న కృష్ణవేణి విగ్రహం, ఒక ప్రైవేటు పాఠశాల ఏర్పాటు చేసిన భారీ బ్యానర్ వెనుక దాగిపోయింది. వ్యాపార ప్రకటనల కోసం ఇలా చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు.
MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గంగాపూర్ రోడ్డులోని కాటన్ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ధర కల్పించి వారి శ్రమకు తగిన న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ జ్యోతి, మున్సిపల్ ఛైర్ పర్సన్ పుష్పలత పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాకు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద, జనరల్ కేటగిరీ కింద 8, ఎస్సీ కేటగిరీ కింద 2, ఎస్టీ కేటగిరీ కింద1, మహిళా కేటగిరీ కింద 2, మొత్తం 13 వాహనాలను మంజూరు అయ్యాయని జిల్లా అదనపు కలెక్టర్ మధు మెహన్ చెప్పారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో లాటరీ విధానం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు.
WNP: గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం పెబ్బేరు మండలంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. హరీష్ రావు పర్యటన అక్రమార్కుల గుండెల్లో గుబులు పుడుతుందని అందుకనే కమిటీల పేట అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారన్నారు.
KMR: జిల్లాలో వేసవి తాగునీటి ఎద్దడిని నివారించేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ‘డ్రింకింగ్ వాటర్ మానిటరింగ్ సెల్’ను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం ప్రారంభించారు. ప్రజలు తమ నీటి సమస్యలను 9908712421 నంబర్‌కు ఫోన్ చేసి తెలపవచ్చన్నారు. జూన్ 30 వరకు ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయిని తెలిపారు.
NLG: దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. 2028 జూన్ నాటికి ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని ఆదేశించారు. పెండ్లిపాకల ప్రాజెక్టు నిర్వాసితులకు తక్షణమే నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని, భూసేకరణ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
PDPL: వ్యాపారస్తులు అందరూ విధిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని ధర్మారం ఎంపీఓ రమేష్ సూచించారు. మంగళవారం ఆయన ధర్మారంలో పంచాయతీ కార్యదర్శులతో కలిసి పలు దుకాణాలను పరిశీలించారు. ట్రేడ్ లైసెన్స్ లేనివారికి నోటీసులు జారీ చేశారు. అలాగే దుకాణాలలో వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులు విక్రయిస్తే రూ. 2500 నుంచి 5000 వరకు జరిమానా విధిస్తామని నోటీసులు అందజేశారు.