హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్(Outer Ring Road)పై వాహనాల గరిష్ఠ పరిమితి వేగాన్ని హెచ్ఎండీఏ (HMDA)పెంచింది. ప్రస్తుతం గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు అనుమతి ఉండగా.. దీన్ని 120 కిలోమీటర్లకు పెంచింది. మంత్రి కేటీఆర్ (Minister KTR) ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వాహనాల గరిష్ఠ పరిమితి వేగాన్ని పెంచేందుకు అనుమతి ఇవ్వగా.. ఈ మేరకు హెచ్ఎండీఏ ఉత్తర్వులు జారీ చేసింది. ఔటర్ రింగ్ రోడ్ ఎనిమిది వరుస యాక్సెస్- నియంత్రిత ఫ్రీవే కాగా.. ప్రతి వైపు నాలుగు వరుసలుంటాయి. ఇప్పటి వరకు మొదటి, రెండు వరుసల్లో గరిష్ఠ పరిమితి వేగం గంటకు 100 కిలోమీటర్ల ఉన్నది.
మూడు, నాలుగో వరుసల్లో గరిష్ఠ పరిమితి వేగం గంటకు 80 కిలోమీటర్లు. మొదటి, రెండు వరుస వేగ పరిమితిని 100 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల వరకు సవరించారు. ఈ సందర్బంగా భద్రతా నియమాలను పాటించేలా చూడాలని మంత్రి కేటీఆర్ హెచ్ఎండీఏను ఆదేశించారని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్‌కుమార్
(Chief Secretary Arvind Kumar) తెలిపారు. ఓఆర్ఆర్ (ORR) (కోకాపేట నుంచి ఘట్కేసర్ వరకు, తారామతిపేట – నానక్‌రామ్‌గూడ వరకు) ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్రయాణికులు 1066, 105910 నంబర్లలో డయల్ చేయాలని హెచ్ఎండీఏ సూచించింది.