మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. నవంబర్ 3న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో..నెల రోజుల్లో ఎలా ప్రచారం చేయాలనే దానిపై పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో మునుగోడులో గ్రామం నుంచి మండల స్థాయి నేతలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఎక్కువ ప్రజాదారణ ఉన్న నేతలకు లక్షల రూపాయలు సైతం ఇచ్చేందుకు పార్టీలు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
మునుగోడు ఎమ్మెల్యే పదవికి కొమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. ఆ సందర్భంగా ఇది మునుగోడు ప్రజల అభివృద్ధి కోసం జరిగే ఎన్నిక అని కొమటి రెడ్డి వ్యాఖ్యానించారు. అధికార TRS పార్టీకి తనకు మధ్య జరిగే ధర్మ యుద్ధమని గతంలో పేర్కొన్నారు. ఈ క్రమంలో బీజేపీ నుంచి పోటీ చేయనున్న రాజగోపాల్ ను ఎలాగైనా గెలిపించాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే బండి సంజయ్ ఐదో విడత పాదయాత్రను రద్దు చేసుకున్నట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో గెలిచి తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తోంది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్నారు. ఈమె 2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి 27 వేల ఓట్లతో రెండో స్థానంలో నిలవగా, TRS నేత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రచారం ముమ్మరం చేస్తుంది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల లోపాలను ఎత్తి చూపుతూ గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తుంది.
ఇక అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి మళ్లీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది. కానీ అధికారికంగా ప్రకటించలేదు. ప్రభాకర్ రెడ్డిపై పలువురు నియోజకవర్గ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో కేసీఆర్ వారిని బుజ్జగించినట్లు తెలిసింది. ఇప్పటికే ఆయా నియోజకవర్గ నేతలతో కేసీఆర్ ప్రత్యేక భేటీ జరిపి.. భారీ మెజారిటీతో గెలిచేందుకు నేతలు కృషి చేయాలని కోరారు. ప్రభాకర్ రెడ్డి 2014లో ఇదే నియోజవర్గం నుంచి గెలుపొందగా, 2018లో కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డి 99 వేల ఓట్లతో విజయం సాధించగా, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 66 వేల ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.
ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలోని 7 మండలాల్లో 2,27,101 మంది ఓటర్లు ఉండగా..వీరిలో అధికంగా బీసీలు ఉన్నారు. చండూరు, చౌటుప్పల్ మున్సిపాలిటీలు ప్రధాన పట్టణాలుగా ఉన్నాయి. ఈ తరుణంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార TRS పార్టీతోపాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సిద్ధమవుతున్నాయి. మరి చివరి క్షణంలో ఓటర్లు ఏ పార్టీకి చెందిన నేతను గెలిపిస్తారో చూడాలి.