»Hyderabad Student Missing For A Month Found Dead In Ohio
Abdul Arfath : అమెరికాలో అదృశ్యమైన హైదరాబాదీ విద్యార్థి మృతి
కొన్ని వారాల క్రితం అమెరికాలోని క్లేవ్ ల్యాండ్‌లో అదృశ్యమైన హైదరాబాదీ విద్యార్థి మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్(25) మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇక్కడున్నాయి.
Mohammed Abdul Arfath : అమెరికాలో క్లేవ్ ల్యాండ్‌లో కొన్ని వారాల క్రితం ఓ హైదరాబాదీ విద్యార్థి అదృశ్యమయ్యాడు. మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్(25) అనే యువకుడు పై చదువుల కోసం హైదరాబాద్ (Hyderabad) నుంచి అమెరికాకు(America) వెళ్లాడు. అక్కడి క్లేవ్‌ల్యాండ్ విశ్వవిద్యాలయంలో ఐటీ మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. కాగా అతడిని కిడ్నాప్ చేసినట్లు హైదరాబాద్‌లోని అతడి తల్లిదండ్రులకు కిడ్నాపర్ల నుంచి ఫోన్ వచ్చింది. ఈ విషయమై రెండు వారాల క్రితం వార్తలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు ఆ యువకుడు మృతి చెందినట్లు న్యూయార్క్‌లోని భారత దౌత్య కార్యాలయం మంగళవారం ఎక్స్‌లో ప్రకటించింది.
ఈ విషయమై భారత దౌత్య కార్యాలయం కొన్ని వివరాల్ని వెల్లడించింది. గత కొంత కాలంగా తాము వెతుకుతున్న మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్ ఓహైయోలోని క్లేవ్‌ల్యాండ్‌లో మృతి చెందినట్లు తెలిపింది. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరిచింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు స్థానిక పోలీసులతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పింది. మృత దేహాన్ని స్వస్థలానికి తరలించడానికి సహాయం చేస్తామని వెల్లడించింది.
హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్(Abdul) గత నెల 7వ తేదీన అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి అతడు తల్లిదండ్రులతో ఫోన్‌కి అందుబాటులో లేడు. తమకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని అతడి తండ్రి మహమ్మద్ సలీం వెల్లడించారు. వారు 1200 డాలర్లు డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వని పక్షంలో తమ కుమారుడి కిడ్నీ విక్రయిస్తామని బెదిరించారన్నారు. ఆ డబ్బు ఇచ్చేందుకు తాము అంగీకరించామని, అబ్దుల్ వాళ్ల ఆధీనంలోనే ఉన్నట్లు ఆధారాలు చూపాలని అడిగామన్నారు. దానికి కిడ్నాపర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఫోన్ పెట్టేశారని తెలిపారు. మళ్లీ కాల్ చేయలేదని సలీం పేర్కొన్నారు. కాకపోతే కిడ్నాపర్ మాట్లాడటానికి ముందు ఫోన్లో ఎవరిదో ఏడుపు వినిపించిందన్నారు. ఆ నంబర్‌ను అమెరికాలోని తమ బంధువులకు పంపి, క్లేవ్ ల్యాండ్ పోలీసులకు అందజేయాలని చెప్పినట్లు సలీం చెప్పారు.