నేతన్నల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) దిశానిర్దేశంలో ఇప్పటికే దేశంలో ఎక్కడా లేనివిధంగా నేతన్నల సంక్షేమం కోసం విభిన్న కార్యక్రమాలను చేపట్టినట్లు కేటీఆర్ వెల్లడించారు.
హైదరాబాద్(Hyderabad)లో చేనేత మ్యూజియాన్ని ఏర్పాటుకు ప్రతిపాదనలను రెడి చేయాలని మంత్రి కేటీఆర్ (Minister KTR) అధికారులను కోరారు. బీఆర్కేఆర్ భవన్లో టెక్స్టైల్(Textile) శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. టెక్స్టైల్ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, వాటి అమలు తీరుపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేతన్నలకు అందిస్తున్న చేనేత మిత్ర లాంటి కార్యక్రమాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గుండ్ల పోచంపల్లి (Gundla Pochampally) అప్పారెల్ పార్క్, గద్వాల్ హ్యాండ్లూమ్ పార్క్ కార్యక్రమాలపై సమీక్షించారు. చేనేత రంగంలోని నేతన్నల కళకు, వృత్తికి మరింత ఆదాయం వచ్చేలా తీసుకోవాల్సిన కార్యక్రమాలపైన అధ్యాయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
నారాయణపేట (Narayanapet), గద్వాల్, దుబ్బాక, కొడకండ్ల, మహాదేవపూర్, కొత్తకోట వంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన పనులపైన అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఒక కార్యాచరణ రూపొందించాలన్నారు. ఆగస్టు 7న నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవాన్ని(Handloom Day) ఘనంగా నిర్వహించాలన్నారు, ఆ రంగంలోని అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్న నేతన్నలకు గుర్తింపునిచ్చేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పవర్లూమ్ రంగం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపైన ప్రత్యేక దృష్టి సారించాలని కేటీఆర్ సూచించారు. దేశంలోనే ఆదర్శంగా ఉన్న తమిళనాడు(Tamil Nadu) లోని తిర్పూర్ క్లస్టర్ మాదిరిగా ఒక సమీకృత పద్ధతిన, అత్యున్నత ప్రమాణాలతో కూడిన పవర్లూమ్ క్లస్టర్లను తెలంగాణలో అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. తిర్పూర్ క్లస్టర్ (Tirpur Cluster) లో పర్యటించి అక్కడ ఉన్న ఆదర్శవంతమైన పద్ధతులను పరిశీలించాలన్నారు.