తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం… దసరా పండగకు.. రాష్ట్రంలోని ఆడపడుచులు అందరికీ..బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ ఏడాది కూడా.. బతకమ్మ చీరల పంపిణీకి సర్వం సిద్ధమైంది. రేపటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఈ చీరలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. మొత్తం కోటీ చీరలు పంపిణీ చేయనున్నట్లు ఆయన చెప్పారు.
ఈ సారి మొత్తం 10 రంగుల్లో 24 డిజైన్లలో 240 రకాల అంచులతో చీరలు ఉంటాయని ఆయన వెల్లడించారు. తమ ప్రభుత్వం బతుకమ్మ చీరల కోసం రూ. 339 కోట్ల 73 లక్షలను ఖర్చు చేసిందన్నారు. బతుకమ్మ చీరల కార్యక్రమంతో నేతన్నల జీవితాల్లో వెలుగులు నిండాయని పేర్కొన్నారు. బతుకమ్మ చీరల పంపిణీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జరగుతుందన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ చీరల వంటి వినూత్న కార్యక్రమాలతో రాష్ట్రంలో నేత కార్మికులను అదుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం టెక్స్ టైల్ ఉత్పత్తులపై జీఎస్టీ పెంచిందన్నారు.
నేతన్నలను నిలువునా ముంచేలాగా కేంద్రం చర్యలు తీసుకుంటోందని మండిపడ్డారు. నేత కార్మికులను, వారి పరిశ్రమను, వారి జీవితాలను కేంద్రం పట్టించుకోకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తాము నేతన్నల కోసం నిబద్ధతతో పనిచేస్తున్నామని చెప్పారు.