CM Revanth Reddy: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో మరో రెండు గ్యారంటీలను త్వరలో అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిన్న ప్రజాపాలన దరఖాస్తులు, గ్యారంటీలపై నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.500కు గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాల అమలుపై మంత్రులు, అధికారులతో సీఎం చర్చించారు. మూడు గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికత సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వీటిలో రెండింటిని తక్షణమే అమల్లోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
ఒక్కో గ్యారంటీ అమలుకు ఎంత ఖర్చవుతుంది? ఎంతమందికి లబ్ధి కలుగుతుందనే వివరాలను తెలుసుకున్నారు. ఈ బడ్జెట్లోనే వాటికి నిధులు కేటాయించాలని సీఎం ఆర్థికశాఖకు తెలిపారు. కొందరు ఒకే పేరుతో రెండు మూడు దరఖాస్తులు చేశారని, మరికొందరు దరఖాస్తులో ఆధార్, రేషన్ కార్డు నెంబర్లు లేవు. ఇలాంటి దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని తెలిపారు. అర్హులైన వాళ్లు నష్టపోకుండా ఒకటికి రెండుసార్లు చూడాలని తెలిపారు. గ్యారంటీల అమలుకు లేని పోని నిబంధనలు పెట్టి ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని, దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారందరూ లబ్ధి పొందేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.