KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సెగలు రేపుతోంది. బీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. సీఎం కేసీఆర్ (KCR) లక్ష్యంగా విపక్షాలు విమర్శలు చేశాయి. గజ్వేల్‌లో బరిలోకి దిగుతాం అని.. కొడంగల్ రా అని మరొకరు సవాల్ విసిరారు. దీనిపై కేసీఆర్ (KCR) స్పందించారు. తన దమ్మెంటో ఇండియా మొత్తం చూసిందని చెప్పారు. ఇప్పుడు కొత్తగా చూడాల్సింది ఏమీ లేదన్నారు. అచ్చంపేట ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ (KCR) తనదైన శైలిలో పంచ్‌లు వేశారు.
కొడంగల్ వత్తవా.. కొడవలి పట్టుకొని వస్తవా
తనను ఒకరు గాంధీ బొమ్మ వద్దకు రా అంటారు. మరొకరు కొడంగల్ వత్తవా.. కొడవలి పట్టుకొని వస్తావా అంటారని కేసీఆర్ గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 24 ఏళ్ల క్రితం ఒంటరిగా ప్రయాణం ప్రారంభించానని గుర్తుచేశారు. తాను పోరాడే సమయంలో ఇప్పుడు మాట్లాడుతున్న నేతలు ఎవరి కాళ్ల వద్ద ఉన్నారో తెలియదన్నారు. తన పోరాటంలో నిజాయితీ ఉందని.. అందుకే సక్సెస్ అయ్యానని కేసీఆర్ తెలిపారు.
ముందు ఉంది దమ్ము కాదా
ఇప్పుడు తననే దమ్ముందా అని అడుగుతున్నారు. తన దమ్మెంటో యావత్ దేశం చూసిందని పేర్కొన్నారు. ఇక్కడ ముందు ఉంది కేసీఆర్ దమ్ము కాదా.. ఆ దమ్ము గట్టిగా బయల్దేరితే దుమ్ము లేవ్వది అన్నారు. లెవ్వాలే.. నవంబర్ 30వ తేదీన దుమ్మురేగాలని కోరారు. స్థానిక అభ్యర్థి గువ్వల బాలరాజు బ్రహ్మండమైన మెజార్టీతో గెలిచి రావాలని కోరారు.
కర్ణాటకలో విద్యుత్ ఇబ్బందులు
మన పక్కన గల కర్ణాటకలో నిరంతరం విద్యుత్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. అక్కడ రైతుల ఇబ్బందులను మనం చూస్తున్నామని పేర్కొన్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 24 గంటల కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఆగం కావొద్దని.. ఎవరి వల్ల తెలంగాణ రాష్ట్రం బాగుపడిందో చూసి ఓటు వేయాలని కోరారు. తమకు కులమతాలు లేవు.. ఉన్నది తెలంగాణ ఒక్కటేనని స్పష్టంచేశారు.