»Bus Accident Happened At Ananthagiri Ghat Road Vikarabad
Accident : వికారాబాద్ లో ఘోరం..అదుపు తప్పి లోయలో పడ్డ బస్సు
ఘాట్ రోడ్డులో బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రయాణికులతో నిండిన ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
Accident : ఘాట్ రోడ్డులో బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రయాణికులతో నిండిన ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాండూరు డిపోకు చెందిన టీఎస్ 34 టీఏ 6363 నంబర్ గల బస్సు హైదరాబాద్ నుంచి తాండూరు వెళ్తుంది. వికారాబాద్ బస్టాండ్ నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరిన ఆర్టీసీ బస్సులో 90 మందికి పైగా ఉన్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని డ్రైవర్ ఎన్టీఆర్ చౌరస్తాలో బస్సును ఆపేశాడు. అయితే అనంతపద్మనాభ స్వామి ఆలయం దాటిన తర్వాత ఘాట్ రోడ్డులో వెళ్తుండగా బస్సు బ్రేకులు ఒక్కసారిగా ఫెయిల్ అయ్యాయి. అప్రమత్తమైన డ్రైవర్ ఎండీ షఫీ బ్రేకులు ఫెయిల్ అయ్యాయని బస్సులోని ప్రయాణికులకు చెబుతూనే ముందుకు జాగ్రత్తగా పోనిచ్చాడు.
చివరి స్టాప్ వద్ద బస్సు అదుపు తప్పి బోల్తా పడకుండా అదును చూసి పొదల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న పెద్ద గొయ్యిలోకి బస్సు దూసుకుపోయింది. దీంతో బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. సమీపంలోని స్థానికులు గమనించి 108కి సమాచారం అందించారు. క్షతగాత్రులను వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్వల్పగాయాలైన వారు మరో బస్సులో వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న ధరూర్, వికారాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనకు సంబంధించి వివరాలు సేకరించారు. అయితే ఏడాది క్రితం కూడా ఇదే స్థలంలో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మరోసారి అదృష్టవశాత్తూ బస్సు బోల్తా పడకపోవడం, ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.