BC Candidate CM: తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకునే పనిలో పార్టీలు ఉన్నాయి. బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించింది. అందులో రెండు పేర్లు ఉన్నాయి.. ఒక్కటి ఈటల రాజేందర్ కాగా మరొకరు ఫైర్ బ్రాండ్ బండి సంజయ్.. శనివారం ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ (bandi sanjay) ఈ అంశంపై స్పందించారు.
చొప్పదండి ప్రచారంలో బండి సంజయ్ పాల్గొన్నారు. తమ పార్టీ గెలిస్తే బీసీ అభ్యర్థి సీఎం అవుతారని తెలిపారు. కానీ తాను అవుతానని చెప్పడం లేదన్నారు. ఆ బీసీ అభ్యర్థిని పార్టీ హైకమాండ్ నియమిస్తోందని తెలిపారు. సీఎం కావాలని మనసులో ఉన్నప్పటికీ.. తాను కాదని, హైకమాండ్ నియమిస్తోందని స్పష్టంచేశారు. బండి సంజయ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఇటీవల బీజేపీ నేత మురళిధర రావు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
ప్రచారంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. ఆ రెండు పార్టీలను ఓడిస్తామని చెప్పారు. కాంగ్రెస్ గ్రాఫ్ పెంచేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ డబ్బులు పంచుతున్నారని.. ఆ కాసులకు కాంగ్రెస్ అమ్ముడుపోయిందన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవీ కోసం నలుగురు పోటీ పడుతున్నారని సంజయ్ చెప్పారు. కేటీఆర్, కవిత, హరీశ్ రావు, సంతోష్ రావు పోటీలో ఉన్నారని.. కాంగ్రెస్ పార్టీలో ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉందన్నారు. ధరణి తప్పుల తడక అని కేసీఆర్ అంగీకరించారని వివరించారు. కేసీఆర్ అఫిడవిట్ ప్రకారం భూ రికార్డుల్లో గుంట భూమి ఎక్కువగా ఉందని చెప్పారు.