IND vs SA: టీమిండియా బౌలర్ల బీభత్సం..83 పరుగులకే దక్షిణాఫ్రికా చిత్తు
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. వరుసగా ఎనిమిదో మ్యాచ్‌లోనూ విజయాన్ని పొందింది. దక్షిణాఫ్రికా జట్టును 83 పరుగులకే ఆలౌట్ చేసి అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా (TeamIndia) బౌలర్లు విజృంభిస్తున్నారు. అద్భుత రీతిలో వికెట్లను పడగొడుతున్నారు. బుల్లెట్ బంతులతో ప్రత్యర్థులను కుప్పకూల్చుతున్నారు. తాజాగా నేడు దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్లు బీభత్సం సృష్టించారు. తమ పంజాను విసిరారు. దక్షిణాఫ్రికా టాపార్డర్‌ను కుప్పకూల్చారు. 83 పరుగులకే దక్షిణాఫ్రికా (South Africa) బ్యాటర్లను చిత్తు చేశారు. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయాన్ని (India Victory) పొందింది.
మొదట బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా (TeamIndia) నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. 327 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా భారత బౌలర్లను తట్టుకోలేకపోయింది. దీంతో 83 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మొదటి 5 వికెట్లను కోల్పోయిన దక్షిణాఫ్రికా 40 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత 83 పరుగులకు అందరూ పెవిలియన్ దారి పట్టారు.
టీమిండియా బౌలర్లలో జడేజా (Jadeja) 5 వికెట్లను పడగొట్టాడు. పేసర్ మహ్మద్ షమీ 2, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీయగా సిరాజ్ ఓ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మొదట సిరాజ్ వికెట్ పడగొట్టి బౌలర్లలో జోష్‌ను నింపాడు. క్వింటన డికాక్ 5 పరుగులకు పెవిలియన్ దారి పట్టడంతో సఫారీలు ఆచితూచి ఆడాయి. అయితే వికెట్ కాపాడుకునేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. టీమిండియా బౌలర్ల భీకర ఫామ్‌లో దక్షిణాఫ్రికా కుప్పకూలింది. దీంతో టీమిండియా ఘన విజయం సాధించింది.