IND vs ENG: రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు. సెంచరీతో కదం తొక్కాడు. ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడి పరుగుల వరద పారించాడు. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియం నలువైపులా షాట్లను కొట్టాడు. ఈ నెల మొదట్లో జరిగిన రెండో టెస్టులో కూడా జైస్వాల్ వీరవిహారం చేశాడు. అదే జోరును రాజ్‌కోట్‌లో కూడా కొనసాగించాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. సిక్సర్లు కొట్టడం ఇంత ఈజీనా అనే విధంగా బ్యాటింగ్ చేశాడు.
ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఇప్పటి వరకు యశస్వీ జైశ్వాల్ 7 టెస్టులు ఆడగా 3 సెంచరీలు సాధించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రస్తుత టెస్టు సిరీస్‌లో జైస్వాల్ తనదైన ప్రత్యేక ముద్రను వేశాడు. మొదటి టెస్టులో హాఫ్ సెంచరీతో అలరించిన జైస్వాల్…రెండో టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీ చేసి క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. రాజ్‌కోట్‌లో జరుగుతున్న మూడో టెస్టులో కూడా శతకం బాది మరోసారి తన సత్తా చాటుకున్నాడు.