NLR: ఉదయగిరి మండల పరిధిలోని కుర్రపల్లిలో మంగళవారం రైతన్న మీకోసం కార్యక్రమం జరిగింది. మండలా వ్యవసాయ అధికారి విజయభాస్కర్ ప్రతి ఇంటింటికి తిరుగుతూ సీఎం చంద్రబాబు నాయుడు సందేశాన్ని వినిపించారు. రబీ సీజన్‌లో పంటలు వేసేందుకు యాక్షన్ ప్లాన్స్ సిద్ధం చేసేందుకు వివరాలు సేకరించారు. నీటి లభ్యత, డిమాండ్ ఆధారిత పంటలు వేసే విధంగా రైతులుకు అవగాహన కల్పించారు.
KMM: కల్లూరు నూతన ఏసీపీగా బాధ్యతలు చేపట్టిన ఐపీఎస్ అధికారిణి వసుంధర, మంగళవారం డీఎఫ్‌వో ఐఎఫ్ఎస్ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పోలీస్, అటవీ విభాగాల మధ్య సహకారాన్ని పెంపొందించడంపై ఇద్దరు అధికారులు దృష్టి సారించినట్లు తెలిపారు. కాగా వసుంధర పుష్పగుచ్ఛం అందజేయగా డీఎఫ్‌వో శుభాకాంక్షలు తెలిపారు.
ప్రకాశం: పామూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఎదురుగా ఉండే నీటి కొళాయి మరమ్మతులకు గురైంది. ఈ కొళాయి ప్రస్తుతం నీరు లేక అలంకారప్రాయంగా మిగిలింది. స్థానిక పంచాయతీ సిబ్బంది చొరవ తీసుకొని కుళాయికి మరమ్మతులు చేసి నీరు అందించాలని ఆ ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
SRCL: వేములవాడ రాజన్న ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ మంగళవారం ఉదయం పరిశీలించారు. కాగా, రూ.150 కోట్ల అంచనా వ్యయంతో సాగుతున్న పనుల్లో భాగంగా ఆలయం దక్షిణవైపు ప్రాకారం విస్తరణ పనులు భారీ యంత్రాల సహాయంతో చేపడుతున్నారు.
JGL: గత ఆగస్టులో మహారాష్ట్రలో భారీ వరదల్లో చిక్కుకుని మరణించిన జగిత్యాల పట్టణంలోని టీఆర్ నగర్‌కి చెందిన హసీనా బేగం, ఆఫ్రినా, సమీనా కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున నష్ట పరిహారం మంజూరు చేసింది. ఈ పరిహారాన్ని మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ బాధిత కుటుంబాలకు ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు.
VZM: భారతీయుల ఆత్మగౌరవానికి భారత రాజ్యాంగం ప్రతీక అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఏ.కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురజాడ పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. మన రాజ్యాంగం సార్వభౌమ, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగమని, ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మన దేశందేనని అన్నారు.
కోనసీమ: ఆత్రేయపురం ర్యాలి గ్రామంలోని శ్రీ జగన్మోహిని కేశవ గోపాల స్వామివారి దేవస్థానంలో నవంబర్ 26న మాస శివరాత్రి సందర్భంగా శ్రవణా నక్షత్ర మాస కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని ఈవో వెంకటరమణమూర్తి తెలియజేశారు. కావున భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి మాస కళ్యాణంలో పాల్గొని ఆశీస్సులు పొందాలని కోరారు.
SKLM: మెరుగైన పరిశుభ్రత ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని DLPO గోపి బాల తెలిపారు. మంగళవారం నరసన్నపేట మండల పరిషత్ సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులు, స్వయం శక్తి మహిళా సంఘాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శులకు మహిళా శక్తి సంఘాలు కూడా సహకారం అందించాలని కోరారు. తడి చెత్త పొడి చెత్త పట్ల అవగాహన పరచాలన్నారు.
VSP: నెల రోజులపాటు హింసకు వ్యతిరేకంగా జరిగే ప్రచార ఉద్యమాన్ని జయప్రదం చేయాలని ఐద్వా విశాఖ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్.ఎన్. మాధవి, వై. సత్యవతి పిలుపునిచ్చారు. మంగళవారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసనలో వారు మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, క్రైమ్ రేటు విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
MBNR: దేవరకద్ర నియోజకవర్గంలోని బస్వాయపల్లి-నందిపేట్ మార్గంలో రూ.2.55 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మంగళవారం భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. గ్రామాభివృద్ధి దిశగా చేపడుతున్న కార్యక్రమాల్లో ఈ రహదారి నిర్మాణం ఎంతో కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
KMR: ప్రయాణికుల సౌకర్యార్థం బాన్సువాడ నుంచి కామారెడ్డి వరకు కొత్తగా డీలక్స్ బస్సు సర్వీస్‌ను ప్రారంభిస్తున్నట్లు బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్ రవి కుమార్ మంగళవారం తెలిపారు. ప్రతి రోజుకు నాలుగు ట్రిప్‌లు బాన్సువాడ-కామారెడ్డి మధ్య బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 5:15, 9, మధ్యాహ్నం 12:45, సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరుతుందని వెల్లడించారు.
VSP: పార్లమెంట్‌లో సీపీఐ ఎంపీల ఒత్తిడి ఫలితంగానే దేశంలో భారీ పరిశ్రమల ఏర్పాటు, కార్మిక చట్టాల రూపకల్పన జరిగాయని ప్రపంచ కార్మిక సమాఖ్య ఉప ప్రధాన కార్యదర్శి, ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి శ్రీకుమార్ అన్నారు. సీపీఐ శత వార్షికోత్సవాలను మంగళవారం విశాఖ పబ్లిక్ లైబ్రరీలో జరిగాయి. కుమార్ మాట్లాడుతూ.. మోదీ పాలన కార్మిక చట్టాలను నాశనం చేసే దిశగా సాగుతోందన్నారు.
HYD: కోకాపేటలో మంగళవారం ఉదయం ఓ కారుకు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోకాపేట ప్రధాన రహదారిలో ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఘటనలో బేస్‌మెంట్ మొత్తం కూలిపోయింది. కారు ముందు భాగం దెబ్బతింది. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
MDK: మహిళలని కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ చేపట్టారు. జిల్లాకు రూ. 30 కోట్లు, నియోజకవర్గానికి 2.88 కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు.
ELR: ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ లీగల్ సెల్ జిల్లా కార్యదర్శి అత్తులూరి శ్రీనివాసరావు కోరారు. మంగళవారం చాట్రాయి మండలం చిన్నంపేటలో జరిగిన ‘రైతన్న మీకోసం’ ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వం రైతులకు చేస్తున్న సేవలను ప్రజలకు వివరించేందుకే ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు.