Railways: ప్లాట్‌ఫామ్ బయట రైలు నిలిపివేత..రైల్వేకు ఫైన్
ఓ రైలు ప్లాట్‌ఫామ్‌పై ఆగకుండా బయట ఆగింది. దీంతో రైలు దిగడానికి చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఏసీ కోచ్ నుంచి దిగే ఓ వృద్ధుడికి గాయం అయ్యింది. దీంతో ఆయన వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన ఆ కమిషన్ రైల్వేకు రూ.30 వేల జరిమానాను విధించింది.
ప్లాట్‌ఫామ్ బయట రైలును నిలిపివేయడంతో రైల్వేశాఖకు జరిమానా విధించారు. ప్లాట్‌ఫామ్ బటయ రైలు నిలిపివేయడం వల్ల చెన్నైకి చెందిన ఓ వృద్ధుడు పట్టాలపైనే దిగాడు. రైలు నుంచి ఆ వృద్ధుడు పట్టాలపై దిగుతున్న క్రమంలో కిందపడి గాయపడ్డాడు. దీనిపై వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు నేపథ్యంలో భారత రైల్వేకు రూ.30 వేల జరిమానాను విధించినట్లు కమిషన్ అధికారులు తెలిపారు.
చెన్నై నగరంలోని కేవీ రమేశ్ అనే వృద్ధుడు నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాడు. అంకాలేశ్వర్ వరకూ ఆయన టికెట్ తీసుకున్నారు. ఏసీ కోచ్‌లో టికెట్ తీసుకుని ప్రయాణించిన ఆయన తన కంపార్ట్మెంట్తో పాటుగా మరో 3 ఏసీ కోచ్‌లు ప్లాట్‌ఫామ్ బయట ఆగిపోవడంతో షాక్ అయ్యాడు. ఆ సమయంలో ఆయన కిందకు దిగలేక దూకే ప్రయత్నం చేశాడు. ఆ దశలో ఆయనకు గాయం అయ్యింది.
దీనిపై చెన్నై జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన కమిషన్ రైల్వే సేవలో జరిగిన లోపాన్ని గుర్తించింది. ఫిర్యాదుదారుడికి రూ.25,000 నగదు, వ్యాజ్య ఖర్చుల కింద మరో రూ.5 వేలను చెల్లించాలని కమిషన్ రైల్వే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనతో రైల్వే శాఖ సదరు రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ప్లాట్‌ఫామ్‌ను పొడిగించింది. ఈ ఘటన వైరల్ అవ్వడంతో సోషల్ మీడియా వేదికగా పలువురు ఆ వృద్ధుడికి ప్రసంశలు కురిపిస్తున్నారు.