గతకొంత కాలంగా ఆన్లైన్ మోసాలు ఎక్కువవుతున్నాయి. విపరీతంగా ఆ మోసాలు పెరిగిపోవడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా లోన్ యాప్‌ల ద్వారా అధిక శాతం మంది మోసపోతూ వస్తున్నారు. వాటిపై గూగుల్ సంస్థ అప్రమత్తమైంది. ఫేక్ యాప్‌లపై గూగుల్ నిఘా ఉంచింది. 2021 ఏప్రిల్ నుంచి 2022 జూలై మధ్యకాలంలో గూగుల్ (Google) తన ప్లే స్టోర్ (Play Store) నుండి 2,500కు పైగా మోసపూరిత రుణ యాప్‌లను డిలీట్ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంటులో వెల్లడించింది.
రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్లే స్టోర్ నుంచి డిలీట్ చేసిన మోసపూరిత రుణ యాప్‌ల వివరాలను రాతపూర్వకంగా తెలిపింది. ఆర్థిక మంత్రి అధ్యక్షతన ఉన్న ఇంటర్-రెగ్యులేటరీ ఫోరమ్ అయిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎఫ్ఎస్డిసి) సమావేశాలలో కూడా ఈ విషయం చర్చించబడుతుందని తెలిపారు. ప్రస్తుతం సవరించిన విధానం ప్రకారం, రెగ్యులేటెడ్ ఎంటిటీల భాగస్వామ్యంతో పని చేసే యాప్‌లు మాత్రమే ప్లే స్టోర్‌లో అనుమతించబడతాయని తెలిపింది.
2021 ఏప్రిల్ నుంచి 2022 జూలై మధ్యకాలంలో గూగుల్(Google) సంస్థ ప్లే స్టోర్ (Play Store) నుండి దాదాపు 3,500 నుండి 4,000 వరకూ లోన్ లెండింగ్ యాప్‌లను సమీక్షించి వాటిలో 2,500 మోసపూరిత యాప్‌లను డిలీట్ చేసింది. ఎప్పటికప్పుడు ఫేక్ న్యూస్ యాప్‌లను గుర్తించి వాటిని తొలగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లుగా గూగుల్ సంస్థ వెల్లడించింది.