ఇస్రో సంస్థ చరిత్ర సృష్టించింది. మొట్ట మొదటి సారిగా ఓ ప్రైవేట్ రాకెట్‌ను తమ ప్రయోగాలకు వినియోగించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగం జరిగింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూశారు. సరిగ్గా ఉదయం 11గంటల 30 నిమిషాలకు ప్రయోగం జరిగింది.
హైదరాబాద్‌కి చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ వీకేఎస్ రాకెట్‌ను రూపొందించింది. దీని బరువు దాదాపుగా 550 కిలోలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ రాకెట్ ద్వారా నింగిలోకి మూడు ఉపగ్రహాలను పంపారు. వాటిలో ఒకటి స్వదేశీది కాగా.. రెండు విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. చెన్నైలోని ఏరోస్పేస్ స్టార్టప్ స్పేస్‌కిడ్స్ రూపొందించిన 2.5 కిలోల చిన్న ఉపగ్రహం ‘ఫన్-శాట్’ ఒకటి. ప్రయోగం మొత్తం 300 సెకెన్లలో పూర్తయ్యింది. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాబాయికి నివాళిగా ఈ రాకెట్‌కు ‘విక్రమ్-ఎస్’ అని నామకరణం చేశారు. భారత్ చేపట్టిన తొలి ప్రైవేటు మిషన్ కావడంతో దీనిని ప్రారంభ్ మిషన్‌గా పిలుస్తున్నారు.
ప్రైవేట్ రాకెట్లను ప్రయోగించడానికి ఇస్రోతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన మొదటి స్టార్టప్ స్కైరూట్. దేశీ మొట్టమొదటి ప్రైవేట్ లాంచ్ కాకుండా, ఇది స్కైరూట్ ఏరోస్పేస్ మొదటి మిషన్. ఈ సంస్థను 2018లో ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు నాగ భరత్ ఢాకా, పవన్ కుమార్ చందన్‌లు ప్రారంభించారు.