అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణ పైన అదానీ గ్రూప్ ఇటీవల స్పందించింది. అమెరికా సంస్థ ఆరోపణలను కొట్టి పారేసింది. దేశీయ సంస్థలపై కావాలని ఈ రీసెర్చ్ సంస్థ బురద జల్లుతోందని 413 పేజీల వివరణ ఇచ్చింది. దీనిపై తిరిగి హిండెన్ బర్గ్ కౌంటర్ ఇచ్చింది. చేసిన తప్పులను జాతీయవాదం ముసుగులో కప్పిపుచ్చే ప్రయత్నాలు చేయవద్దని పేర్కొన్నది. తాము చేసిన కీలక ఆరోపణలపై నిర్ధిష్ట సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నది. తాము లేవనెత్తిన 106 పేజీలలోని 88 ప్రశ్నల్లో 62 ప్రశ్నలకు అదానీ సమాధానం ఇవ్వడంలో ఫెయిల్ అయ్యినట్లు తెలిపారు. అదానీ 413 పేజీల వివరణలో 30 పేజీలలో నివేదికకు సంబంధించిన అంశాలు, 330 పేజీల్లో కోర్టు పత్రాలు, 53 పేజీల్లో సంబంధం లేని సాధారణ అంశాలు పొందుపరిచినట్లు తెలిపారు.
భారత సంస్థలపై తాము ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేస్తున్నట్లు చేసిన ఆరోపణలు సరికాదు అని హిండెన్ బర్గ్ తెలిపింది. భవిష్యత్తులో భారత్ సూపర్ పవర్ గా ఎదుగుతుందని, అలాగే మాకు భారత ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉందని పేర్కొన్నది. కానీ అదానీ గ్రూప్ పథకం ప్రకారం దేశాన్ని కొల్లగొడుతుందని, అదానీ చేసిన మోసం మోసమే అవుతుందని తెలిపింది. సంబంధిత సెక్యూరిటీలు, విదేశీ మారకపు చట్టాలను తాము ఉల్లంఘించినట్లు అదానీ తమపై తీవ్ర ఆరోపణలు చేసిందని, వీటిని తాము ఖండిస్తున్నామన్నారు.