COVID : దేశంలో కోవిడ్ కేసులు మరోసారి పెరుగుతున్నాయి. ఇటీవల కేరళలో కోవిడ్ కొత్త సబ్ వేరియంట్ వెలుగులోకి వచ్చింది. JN.1 సబ్‌వేరియంట్‌ను కనుగొన్నారు. చైనాలో మరోసారి కరోనా కేసులకు కారణమయ్యే ఈ రూపాంతరాన్ని మొదటిసారిగా భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో గుర్తించారు. JN.1 సబ్‌వేరియంట్, దీనిని BA.2.86 వేరియంట్ అని కూడా పిలుస్తారు. ఇది మొదటిసారి సెప్టెంబర్ 2023 లో అమెరికాలో కనుగొనబడింది. ఇప్పుడు ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించడంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొంది. డిసెంబర్ 8న కేరళలో COVID-19 సబ్-వేరియంట్ JN.1 కేసు కనుగొనబడింది. 79 ఏళ్ల మహిళ నమూనాలను పరీక్షించగా ఈ కొత్త వేరియంట్ లక్షణాలు ఉన్నట్లు తెలిసింది. ఈ వేరియంట్ మానవ రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంతే కాకుండా వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు.
సింగపూర్‌లోని ఒక భారతీయ పర్యాటకుడు కూడా JN.1 సబ్-వేరియంట్‌ను కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాకు చెందిన ఓ వ్యక్తిలో ఇది లభ్యమైంది. ఆ తర్వాత ఈ వేరియంట్ దేశంలో మరెక్కడా కనిపించలేదు. కేరళలో తాజాగా వెలుగులోకి రావడంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటి వరకు ఈ వేరియంట్ కారణంగా ఆసుపత్రిలో చేరడం లేదా తీవ్రమైన అనారోగ్యం భారిన పడిన దాఖలాలైతే లేవు. దాదాపు ఏడు నెలల తర్వాత భారతదేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. JN.1 ఇప్పటికే అనేక పాశ్చాత్య దేశాలలో విస్తరిస్తోంది.