గత ఐదు రోజుల్లో గుజరాత్ రాష్ట్రంలో 'చండీపురా వైరస్' కారణంగా ఆరుగురు చిన్నారులు మరణించారని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి హృషికేష్ పటేల్ సోమవారం (జూలై 15) తెలిపారు.
Chandipura Virus : గత ఐదు రోజుల్లో గుజరాత్ రాష్ట్రంలో ‘చండీపురా వైరస్’ కారణంగా ఆరుగురు చిన్నారులు మరణించారని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి హృషికేష్ పటేల్ సోమవారం (జూలై 15) తెలిపారు. ప్రస్తుతం అనుమానిత కేసుల సంఖ్య 12కి చేరింది. చండీపురా వైరస్ జ్వరాన్ని కలిగిస్తుంది, ఇది ఫ్లూ-వంటి లక్షణాలు.. తీవ్రమైన ఎన్సెఫాలిటిస్ (మెదడు వాపు)తో కూడి ఉంటుంది. ఇది దోమలు, ఈగలు మొదలైన వాటి ద్వారా వ్యాపిస్తుంది.
ఈ 12 మంది రోగులలో నలుగురు సబర్కాంత జిల్లాకు చెందినవారు, ముగ్గురు ఆరావళి, మహిసాగర్.. ఖేడా నుండి ఒక్కొక్కరు ఉన్నారని హృషికేశ్ పటేల్ తెలిపారు. ఇద్దరు రోగులు రాజస్థాన్‌కు చెందినవారు. ఒకరు మధ్యప్రదేశ్‌కు చెందినవారు. వీరు గుజరాత్లో చికిత్స పొందారు. రాష్ట్రంలో చండీపురా వైరస్‌తో అనుమానాస్పదంగా ఆరుగురు మరణించారని, అయితే శాంపిల్ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే ఈ మరణాలు చండీపురా వైరస్ వల్లా కాదా అనేది స్పష్టమవుతుంది.
సబర్కాంత జిల్లాలోని హిమ్మత్‌నగర్‌లోని సివిల్ ఆసుపత్రిలో ఆరు మరణాలలో ఐదు సంభవించాయని ఆయన చెప్పారు. సబర్కాంత ఎనిమిది కేసులతో సహా మొత్తం 12 నమూనాలను పరీక్ష కోసం పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి)కి పంపారు. జూలై 10న హిమ్మత్‌నగర్ సివిల్ హాస్పిటల్‌లోని పీడియాట్రిషియన్లు నలుగురు పిల్లల మరణానికి చండీపురా వైరస్ కారణమని అనుమానించారు. వారి నమూనాలను పరీక్ష కోసం పంపారు. దీని తర్వాత, ఆసుపత్రిలో మరో నలుగురు పిల్లలలో ఇలాంటి లక్షణాలు కనిపించాయి. చండీపురా వైరస్ అంటువ్యాధి కాదని పటేల్ అన్నారు. అయితే ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా నిఘా పెట్టారు. 4,487 ఇళ్లలో 18,646 మందిని పరిశీలించాం. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు వైద్యారోగ్యశాఖ 24 గంటలూ పని చేస్తోందన్నారు.