Neha Sharma: బాలీవుడ్ నటి, మోడల్ నేహా శర్మ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయాల్లోకి రావచ్చని ఆమె తండ్రి వెల్లడించారు. మహాకూటమి సీట్ల పంపకాల చర్చల తర్వాత తమ పార్టీకి ఈ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం వస్తే, ఆ నియోజకవర్గం నుంచి తన కుమార్తెకు టికెట్ వచ్చే అవకాశం ఉందని బీహార్‌లోని భాగల్పూర్ ఎమ్మెల్యే అజిత్ శర్మ అన్నారు. ఎమ్మెల్యే అజిత్ శర్మ మాట్లాడుతూ.. భాగల్పూర్ సీటు మా కంచుకోట అయినందున కాంగ్రెస్‌కే సీటు రావాలని, సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు. మాకు ఈ సీటు వస్తే ఎవరు పోటీ చేయాలనేది పార్టీ హైకమాండ్‌దేనని, పార్టీ నన్ను అడిగితే నేను పోటీ చేస్తాను లేదా నా కూతురు నేహా శర్మ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చన్నారు. మనం వేచి చూడాలి. ” అని అన్నారు.
ఎన్డీయేతో ‘ఇండియా’ కూటమి పోరాడే అవకాశాలపై శర్మ మాట్లాడుతూ.. కాంగ్రెస్ విజయంపై తనకు నమ్మకం ఉందన్నారు. బీహార్‌లో బీజేపీని తుడిచిపెట్టుకుపోతుందన్నారు. బీహార్‌లో ‘ఇండియా’ కూటమికి సంబంధించిన సీట్ల పంపకాల ప్రకటన ఈ వారంలో వెలువడుతుందని భావిస్తున్నామని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ అన్నారు. మార్చి 18న ముంబైలో జరిగిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ర్యాలీకి హాజరైన తర్వాత పాట్నాకు తిరిగి వచ్చిన యాదవ్, మహాకూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకంపై కొద్ది రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో అన్నీ తేల్చేస్తామని ఆయన చెప్పారు.