ఆన్ స్క్రీన్‌లో సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ రొమాన్స్ చూసి.. ఆఫ్ స్క్రీన్‌లోను ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారని గట్టిగా నమ్ముతున్నారు జనాలు. కానీ ఈ విషయంలో ఎప్పుడు ఓపెన్ అవడం లేదు సుధీర్, రష్మీ. అయినా ఈ ఇద్దరి జోడి బుల్లితెర పై కనిపిస్తే.. ఆ షో బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ ఇద్దరిని బుల్లితెర హీరో హీరోయన్లని చెప్పొచ్చు. అయితే ఈ ఇద్దరు వేర్వేరుగా సినిమాలు కూడా చేస్తున్నారు.
కానీ ఇప్పటి వరకు బిగ్ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అభిమానులు కూడా సుధీర్-రష్మీ జంటను పెద్ద తెరపై చూడాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు అందుకు రంగం సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ నటించిన ‘గాలోడు’ అనే సినిమా నవంబర్ 18న విడుదల అవుతుంది.
ఈ సినిమాతో మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు సుధీర్. దాంతో ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నాడు సుధీర్. అందులోభాగంగా.. రష్మీతో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్టు చెప్పుకొచ్చాడు సుధీర్. ఆ సినిమా టైటిల్ ‘గజ్జల గుర్రం’ అని.. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని చెప్పాడు. అయితే ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ అని.. అందులో తన పాత్ర కీలకంగా ఉంటుందన్నాడు.
త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయని క్లారిటీ ఇచ్చాడు. అలాగే జబర్దస్త్‌కి తిరిగి వస్తున్నట్లు మరోసారి క్లారిటీ ఇచ్చాడు. దాంతో సుధీర్, రష్మీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అంతేకాదు.. బుల్లితెరపై టీఆర్పీ రికార్డు బద్దలు చేసే రష్మీ-సుధీర్ కాంబినేషన్.. బిగ్ స్క్రీన్ పై కూడా మురిపించడం ఖాయమంటున్నారు. మరి గజ్జెల గుర్రం ఎప్పుడు కార్య రూపం దాల్చుతుందో చూడాలి.