ఓ పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవడం ఈ మధ్య చూస్తునే ఉన్నాం. ఇప్పుడు ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సలార్ విషయంలోను అదే జరగబోతోంది. నైజాం ఏరియాలో సలార్ టికెట్స్ భారీగా పెరగనున్నాయి.
వరల్డ్ వైడ్‌గా ఉన్న మూవీ లవర్స్ అంతా.. ప్రస్తుతం సలార్(Salaar) సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. డే వన్ నుంచే థియేటర్ టాపులు లేచిపోయేలా సలార్ సునామీ రాబోతోంది. ప్రభాస్ లాంటి మాస్ కటౌట్‌కి ప్రశాంత్ నీల్ ఇచ్చే ఎలివేషన్ మామూలుగా ఉండదని..ఇప్పటికే శాంపిల్‌గా ట్రైలర్‌తో చెప్పేశారు. దేవగా, డైనోసర్గా ప్రభాస్ యాక్షన్ ఊహకందని విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. పైగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ‘ఏ’ సర్టిఫికేట్ ఇవ్వడంతో.. యాక్షన్ డోస్ మామూలుగా ఉండదని అర్థమవుతోంది.
యాక్షన్ అంటే.. అట్టాంటి ఇట్టాంటి యాక్షన్ కాదట. ఒరిజినల్‌గా డైనోసర్ దాడి చేస్తే ఎలా ఉంటుందో.. అలా ఉంటుందట. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ చేయకపోయినా.. ఆటోమేటిక్‌గా సలార్ పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. డిసెంబర్ 22న సలార్ రిలీజ్ కానుంది. అంటే మరో 9రోజుల్లో సలార్ థియేటర్లోకి రానుంది. దీంతో మేకర్స్ టికెట్ రేట్లు పెంచడానికి రెడీ అయ్యారు. ఏపీలో పెద్దగా టికెట్ రేట్లు పెరిగే ఛాన్స్ ఉండకపోవచ్చు కానీ.. తెలంగాణలో మాత్రం ప్రస్తుతం ఉన్న టిక్కెట్ల రేటుకు అదనంగా 100 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. సలార్ నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకున్నారు.
దీంతో 6 షోల పర్మిషన్తో పాటు టికెట్ రేట్ పెరుగుదలకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఆ లెక్కల ప్రకారం మల్టీప్లెక్స్‌లలో జీఎస్టీ(GST)తో కలిపి రూ.413, సింగిల్ స్క్రీన్లకు జీఎస్టీతో కలిపి 236 రూపాయల వరకు టికెట్ ధరలు పెంచనున్నారు. ఈ రేట్లు సినిమా రిలీజ్ అయిన ఒక వారం ఉండనున్నాయి. ఆ తర్వాత వారంలో మల్టీప్లెక్స్‌లకు రూ.354, సింగిల్ స్క్రీన్లకు 230 రూపాయలుగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే.. ఇంకా ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. లేకుంటే.. ప్రస్తుతం ధరలు మల్టీప్లెక్స్‌ల రూ.295, సింగిల్ స్క్రీన్ 175 రూపాయలుగానే సలార్ టికెట్ రేట్లు ఉండనున్నాయి. మరి సలార్ టికెట్ రేట్లు పెరుగుతాయో లేదో చూడాలి.